బియ్యం కార్డు ఉన్న వారికి ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరంలేదు : మంత్రి ధర్మాన
రాష్ట్రంలో బియ్యం కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బియ్యం కార్డు ఉన్న వారికి ఇకపై ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరం లేదని రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రకటించారు. అలాగే ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇకనుంచి నాలుగేళ్ల పాటు చెల్లుబాటు అవుతాయని ఆయన స్పష్టం చేశారు.
దీనిమీద మంత్రి ధర్మాన తొలిసంతకం చేశారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా ధర్మాన కృష్ణదాస్ శనివారం బాధ్యతలు చేపట్టారు. త్వరలో రెవెన్యూ సేవలు గ్రామ, వార్డు సచివాలయల ద్వారానే అందే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి ధర్మాన అన్నారు.