మహిళల మీద జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ కు తెలుగు మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఫిర్యాదు చేశారు. వైసీపీ అధికారం చేపట్టాక ప్రభుత్వ మహిళా ఉదయిగులపైన దాడులు పెరిగిపోయాయని పేర్కొంటూ లేఖ రాశారు. 2019 అక్టోబర్ లో సరళ అనే ఎంపీడీఓ పై దాడి, 2020 మార్చిలో కూడా డాక్టర్ అనితారాణిపై వేధింపులు, 2020 జులైలో దళిత బాలిక మీద సామూహిక అత్యాచారం ఘటనల్ని లేఖలో పేర్కొన్నారు.
పలు ఘటనల్లో నిందితులకు అధికార పార్టీ నేతలు అండగా నిలుస్తున్నారని వివరించారు. ఇటువంటి ఘటనలతో ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ప్రత్యేకించి మహిళలు చాలా భయాందోళనలో జీవిస్తున్నారని మహిళా కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో మహిళలపై మరీ ముఖ్యంగా దళిత మహిళలపై జరుగుతున్న హింసాత్మక చర్యలు అట్రాసిటీలను దృష్టిలో పెట్టుకొని తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.