అనంతపురం జిల్లాలో గత నాలుగురోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనంతపురం నగరం సహా శివారు కాలనీల్లో భారీగా నీళ్లు చేరాయి. గుత్తి అలాగే గుంతకల్లు లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో గుత్తిలోని రహదారి ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. జాతీయ రహదారి 63 మీద వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. విడపనుకళ్లు మండలం దోనేకల్లు వద్ద రహదారిపై కారకముక్కల వాగు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో శనివారం తెల్లవాఱుజామునుంచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఈ వాగు తాటుతుండగా ఓ యువకుడు గల్లంతయ్యాడు. దీంతో అక్కడే ఉన్న కొంతమంది వ్యక్తులు వెంటనే అప్రమత్తమై తాళ్ల సహాయంతో యువకుడిని బయటకు తీశారు. ప్రస్తుతం ఆ యువకుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం.