ముంబైలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నగర శివారులోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉరుములతో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో ముంబై పరిసర ప్రాంతాల్లో రికార్డుస్థాయి వర్షం కురిసింది. కొలాబాలో 60 మి.మీ వర్షం కురువగా.. థానేలో ఇంచుమించు ఇదేస్థాయిలో పడింది.
ఇక ముంబై మహానగరంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వాన పడింది. దీంతో రోడ్లపై మోకాళ్లోతు వరద నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదర్, హింద్మాతా తదితర లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో చెరువులను తలపించాయి. నేవీ ముంబై పరిధిలోని వాషి ప్రాంతంలో ట్రాఫిక్ భారీగా స్తంభించింది.