ఆంధ్రుల కలల రాజధాని అమరావతి కోసం అసైన్డ్ భూములిచ్చిన ఓరైతు ప్రభుత్వ విధానం కారణంగా మనోవేదనతో గుండెపోటుకు గురై మరణించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మల్కాపురం గ్రామానికి చెందిన గోచిపాత నాగులు(45) తనకు ఉన్న 97 సెంట్ల అసైన్డ్ భూమిని అమరావతి రాజధాని కోసం ఇచ్చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లను అమ్ముకుని తన ఇద్దరు ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేయాలని, అక్కడ సొంత ఇంటిని నిర్మించుకోవాలని భావించేవారు. అంతేకాదు తనకు భూమి లేకపోయినా పర్వాలేదు..
ఆంధ్రులకు రాజధాని ఉండాలన్న ఆశయంతో అసైన్డ్ భూమిని ఇచ్చారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానులు అంటూ గందరగోళం సృష్టించింది. దాంతో అమరావతిలో రాజధాని ఉండదేమో అని మనోవేదన చెందారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురైన ఆయన తుదిశ్వాస విడిచారు నాగులు. కాగా ఆయన అమరావతి జేఏసీలో కీలకంగా వ్యవహరించారు. ఆయన హఠాన్మరణం పట్ల అమరావతి జేఏసీ నాయకులూ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.