ఆయన దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పహారా కాశారు. భార్యా బిడ్డలను వదిలి దేశ ప్రజల క్షేమం కోసం శ్రమించి ఆర్మీ అధికారిగానే రిటైరయ్యారు. ఒక్కగానొక్క కుమారుడిని కూడా భారత వైమానిక దళంలోకి పంపించారు. ఈ నేపథ్యంలో భార్య తీవ్ర అస్వస్థతకు గురవడంతో టెస్ట్ చేయిస్తే పాజిటివ్ అని తేలింది. చికిత్స తీసుకుంటూనే ఆమె మృతి చెందారు. భార్యకు స్థానిక శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించబోతుంటే స్థానికులు అడ్డుకుని వారి కారుపై రాళ్లు విసిరారు. పోలీసుల జోక్యంతో ఎట్టకేలకు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఏలూరు విద్యానగర్ కు చెందిన రిటైర్డ్ సైనికాధికారి భార్య ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో కొవిడ్ తో మరణించారు. ఆస్పత్రి సిబ్బంది సోమవారం రాత్రి 10.30 గంటలకు ప్రత్యేక వాహనంలో మృతదేహాన్ని తీసుకువచ్చారు. ఆ వెనుక కుటుంబసభ్యులు కారులో వచ్చారు. అయితే వారిని స్థానికులు అడ్డుకుని ఆందోళన చేశారు. అది చూసి రిటైర్డ్ అధికారి చలించి పోయారు. ఇన్నాళ్లు దేశానికి సేవ చేస్తే మీరిచ్చే బహుమతి ఇదేనా అని ఆయన ఆవేదన చెందారు.