సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వద్ద కాల్పుల కలకలం చోటుచేసుకుంది. నియంత్రణ రేఖ వద్ద అక్రమంగా చొరబడేందకు ప్రయత్నించిన పాక్ ఉగ్రవాదులను భద్రతా దళాలు తిప్పికొట్టాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
జమ్మకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ సమీపంలో మంగళవారం రాత్రి పాకిస్థానీ ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నించారు. నౌషెరా సెక్టార్‌లో ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించారని, భారత సైనికులను చూడగానే కాల్పులు జరిపారని.. బాంబులు విసిరేశారని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ప్రతిగా భద్రతా దళాలు కాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. దీంతో నియంత్రణా రేఖ వెంబడి గాలింపు చేపట్టారని, అది ఇంకా కొనసాగుతున్నదని వెల్లడించారు.