తెలంగాణ నుంచే తొలి వ్యాక్సిన్: కేటీఆర్

Update: 2020-08-04 21:47 GMT

వ్యాక్పిన్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది ప్రపంచం. కరోనా మహమ్మారి కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కార మార్గమని బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికే పలు సంస్థలు వ్యాక్సిన్ ట్రయల్స్ లో తుది రూపు సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి కరోనా వైరస్ కు తొలి వ్యాక్సిన్ వస్తుందని మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఉన్న భారత్ బయోటెక్ సంస్థ నుంచే ఆ టీకా వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ సెంటర్ ను రాష్ట్ర మంత్రి కేటీఆర్ సందర్శించారు. సంస్థకు చెందిన ఉద్యోగులతో ఆయన మాట్లాడారు. బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణా ఎల్లా, తెలంగాణ లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మా డైరెక్టర్ శక్తి నాగప్పన్ తో కలిసి మంత్రి చర్చించారు. వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్ ముందంజలో ఉండడం గర్వంగా ఉందని మంత్రి అన్నారు.

కరోనాకు టీకా తొలుత భారత్ బయోటెక్ నుంచి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ తయారీలో భారత్ భాగస్వామ్యం కీలకమైందని ప్రపంచదేశాలు ఇప్పటికే భారత్ ను ప్రశంసిస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ కూడా మంత్రి నిర్వహించిన చర్చలో పాల్గొన్నారు.

Similar News