Crime : కరడుగట్టిన నేరగాడు బత్తుల ప్రభాకర్ కోసం 15 పోలీస్ టీమ్స్ గాలింపు
రాజమహేంద్రవరం జైలు నుంచి విజయవాడ కోర్టుకు తీసుకెళ్తున్న కరడుగట్టిన నేరస్తుడు బత్తుల ప్రభాకర్ సోమవారం రాత్రి పోలీసుల ఎస్కార్ట్ నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు వద్ద జరిగింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు అతని కోసం ఏపీ, తెలంగాణలో తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. అతన్ని పట్టుకోవడానికి మొత్తం 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు కొవ్వూరు డీఎస్పీ జి.దేవకుమార్ వెల్లడించారు.
ఘటన వివరాలు:
రాజమహేంద్రవరం జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీ ప్రభాకర్ మరో ఇద్దరు గంజాయి నిందితులను సోమవారం ఉదయం విజయవాడలోని కోర్టుకు తీసుకువెళ్లారు. విజయవాడకు చెందిన ఒక ఏఎస్సై, ఇద్దరు ఎస్కార్ట్ సిబ్బంది వారిని తిరిగి జైలుకు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో గంజాయి నిందితులిద్దరికీ కలిపి సంకెళ్లు వేయగా, ప్రభాకర్ రెండు చేతులకు కలిపి సంకెళ్లు వేశారు. దుద్దుకూరు వద్ద రోడ్డు పక్కన ఉన్న ఒక హోటల్ దగ్గర వాహనం ఆపగా మూత్రం వస్తుందని చెప్పి ప్రభాకర్ తన కుడి చేతి సంకెళ్లు తొలగించుకున్నాడు. ఆ తర్వాత వెంటనే పొలాల్లోకి దూకి పారిపోయాడు. జైలుకు కేవలం పది నిమిషాల దూరంలో ఉన్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
ప్రభాకర్ చరిత్ర:
చిత్తూరుకు చెందిన ప్రభాకర్ విద్యా సంస్థలు, ఆసుపత్రులే లక్ష్యంగా చోరీలు చేస్తుంటాడు. ఇతనిపై తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటకలలో కూడా పలు కేసులున్నాయి. అతడిపై తెలుగు రాష్ట్రాల్లో 42, ఇతర రాష్ట్రాల్లో 44 వరకు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. గతంలో కూడా ఇతను పోలీసులను తప్పించుకుని పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ సంఘటనలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పోలీసుల గాలింపు:
ప్రభాకర్‌ను పట్టుకునేందుకు కొవ్వూరు డీఎస్పీ జి.దేవకుమార్ ఆధ్వర్యంలో 15 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాల్లో 10 మంది సీఐలు, 15 మంది ఎస్సైలు, 40 మంది సిబ్బంది ఉన్నారు. ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్‌కు కూడా పంపినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే ప్రభాకర్‌ను పట్టుకుంటామని డీఎస్పీ ధీమా వ్యక్తం చేశారు.