Nellore : నెల్లూరులో దారుణం.. పోస్టుమార్టానికి రూ.15వేలు లంచం డిమాండ్ చేసిన డాక్టర్

Nellore : గవర్నమెంట్‌ డాక్టర్‌ అయినా.. మనిషిని బతికించడానికి డబ్బులు తీసుకున్న వారిని చూశాం. కాని, పోస్టుమార్టం చేయడానికి కూడా లంచం డిమాండ్ చేసే వారిని ఏపీలోనే చూస్తాం.

Update: 2022-05-05 03:35 GMT

Nellore : గవర్నమెంట్‌ డాక్టర్‌ అయినా.. మనిషిని బతికించడానికి డబ్బులు తీసుకున్న వారిని చూశాం. కాని, పోస్టుమార్టం చేయడానికి కూడా లంచం డిమాండ్ చేసే వారిని ఏపీలోనే చూస్తాం. నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలలోని డాక్టర్‌ బాషా.. పోస్టుమార్టం చేయడానికి ఏకంగా 15 వేలు లంచం డిమాండ్ చేశాడు. అంతేకాదు, తన అటెండర్‌కు మరో వేయి రూపాయలు ఇవ్వాలని ఆర్డర్‌ వేశాడు. రోజు కూలీ చేసుకునే వాళ్లం అంత డబ్బు ఇవ్వలేమని వేడుకున్నా.. కనీసం దయ చూపలేదా డాక్టర్. వాళ్లనీ వీళ్లని డబ్బులడిగి 15వేలు డాక్టర్ చేతిలో పెడితే గాని పోస్టుమార్టం చేయలేదు డాక్టర్ బాషా. ఈ తతంగం మొత్తం వీడియో తీసి, సోషల్‌ మీడియాలో పెట్టడంతో డాక్టర్‌ బాషాపై సస్పెన్సన్‌ వేటు పడింది.

పశ్చిమ గోదావరి జిల్లా కుక్కనూరు మండలానికి చెందిన ముదిరాజు, భార్య మునీశ్వరి, ఇద్దరు పిల్లలతో కలిసి వలస కూలీలుగా నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని తూర్పుకొండారెడ్డిపల్లికి వచ్చారు. భార్యా పిల్లల్ని పోషించడం కోసం అప్పులు చేశాడు. అప్పు తీర్చలేనేమోననే భయంతో ముదిరాజు ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ముదిరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు పంపించారు. అసలే భర్త పోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే.. పోస్టుమార్టానికి లంచం ఇస్తావా లేదా అంటూ కర్కశంగా ప్రవర్తించాడు డాక్టర్ బాషా. 15వేలు ఫోన్‌పే చేస్తేనే పోస్టుమార్టం తరువాత నీ భర్త డెడ్‌బాడీ వస్తుందని తెగేసి చెప్పేశాడు. తన ఫోన్‌పే నెంబర్‌ను ఓ పేపర్‌లో రాసిచ్చాడు కూడా. భర్త మృతదేహం కోసం మృతుడి భార్య 16వేలు చెల్లించుకుంటే గాని పోస్టుమార్టం బాడీ ఆమె చేతికి రాలేదు.

డాక్టర్ బాషా 15వేల లంచం, అటెండర్‌కు వేయి రూపాయలతోనే సరిపెట్టలేదు. పోస్టుమార్టం చేయడానికి కావాల్సిన ప్రతి సామాగ్రిని మృతుడి భార్యతోనే తెప్పించుకున్నాడు. ఏమేం కావాలో లిస్టు రాసి కింద సంతకం కూడా పెట్టాడు. 8 మీటర్ల తెల్లగుడ్డ, ఒక ప్లాస్టిక్ చాప, ఒక ప్లాస్టిక్ డబ్బా, కేజీ ఖళ్లు ఉప్పు, ఐదు తాళ్లు, ఒక కత్తి, నాలుగు ఏ4 సైజ్ జిరాక్స్ పేపర్లు, రోజ్ వాటర్ డబ్బా, మూడు అత్తర్లు, మూడు కర్పూరం బిల్లలు అంటూ పెద్ద లిస్ట్‌ రాసి కింద సంతకం కూడా పెట్టాడు డాక్టర్ బాషా. మొన్న రుయా ఆస్పత్రిలో కొడుకు శవాన్ని తీసుకెళ్లడానికి ఆంబులెన్స్‌ మాఫియా అడ్డుపడినట్టుగానే.. ఉదయగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో భర్త శవాన్ని తీసుకెళ్లడానికి ఏకంగా 15వేలు లంచం ఇవ్వాల్సి వచ్చింది.

Tags:    

Similar News