Vijayawada : విజయవాడలో విమానానికి తప్పిన పెను ప్రమాదం.. రెక్కలను ఢీకొన్న పక్షి
విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఈ రోజు ఉదయం 8:25 గంటలకు బయలుదేరాల్సిన విమానం టేకాఫ్ అవుతుండగా, దాని రెక్కలను ఒక పక్షి బలంగా ఢీకొంది. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని సురక్షితంగా తిరిగి రన్‌వే మీదకు తీసుకొచ్చారు. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. విమానం రెక్కలకు స్వల్పంగా నష్టం వాటిల్లినట్లు సమాచారం.
విమానం పరిస్థితిని సాంకేతిక సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరమ్మతులు పూర్తయ్యాక తదుపరి ప్రయాణంపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.