Adani Group : ఏపీకి అదానీ బంపర్ ఆఫర్.. కొత్తగా రూ.లక్ష కోట్లు పెట్టుబడి.
Adani Group : ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. రాబోయే దశాబ్దంలో రాష్ట్రంలో ఒక లక్ష కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడి పెట్టనున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. ఇప్పటికే పోర్టులు, లాజిస్టిక్స్, సిమెంట్ వంటి రంగాలలో చేసిన రూ.40,000 కోట్ల పెట్టుబడికి ఇది అదనం. ఈ కొత్త పెట్టుబడులు ప్రధానంగా డేటా సెంటర్లు, సిమెంట్, ఇంధనం వంటి రంగాలపై దృష్టి సారిస్తాయని తెలిపారు.
అదానీ పోర్ట్ అండ్ ఎస్‌ఈజెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు కరణ్ అదానీ, ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఈ భారీ పెట్టుబడి గురించి వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో పోర్టులు, లాజిస్టిక్స్, పునరుత్పాదక ఇంధన రంగంలో రూ.40,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లు ఆయన తెలిపారు. రాబోయే పదేళ్లలో పోర్టులు, సిమెంట్, డేటా సెంటర్లు, ఇంధనం, ఆధునిక తయారీ రంగాలలో మరో లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని అదానీ గ్రూప్ లక్ష్యంగా పెట్టుకుంది.
కరణ్ అదానీ వైజాగ్ టెక్ పార్క్ పేరుతో 15 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1,25,000 కోట్లు) విజన్‌ను ప్రకటించారు. ఇందులో అమెరికన్ కంపెనీ గూగుల్ తో భాగస్వామ్యం ఉంది. ఈ భాగస్వామ్యంతో విశాఖపట్నంలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్-పవర్డ్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఎకోసిస్టమ్ లో ఒకదాన్ని నిర్మించనున్నారు. ఇది గూగుల్ సంస్థకు ఏఐ రంగంలో అమెరికా వెలుపల అతిపెద్ద పెట్టుబడి కావడం గమనార్హం. ఈ 15 బిలియన్ డాలర్ల ఉమ్మడి ప్రాజెక్ట్ రాబోయే ఐదేళ్లలో పూర్తవుతుంది.
"ఆంధ్రప్రదేశ్‌పై అదానీ గ్రూప్‌కు ఉన్న విశ్వాసం కొత్తదేమీ కాదు. మేము కేవలం వాగ్దానాలు చేయం, పెట్టుబడి పెట్టి చూపిస్తాం" అని కరణ్ అదానీ అన్నారు. అదానీ గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌ను కేవలం పెట్టుబడులకు గమ్యస్థానంగా కాకుండా, రాబోయే పదేళ్లలో భారతదేశ ఆర్థిక మార్పుకు నాంది పలికే కీలకమైన స్టెప్‌గా భావిస్తోంది. ఈ భారీ పెట్టుబడి సుస్థిర అభివృద్ధి, హై-టెక్నాలజీ పురోగతి లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడుతుందని ఆయన వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌తో పాటు, అదానీ గ్రూప్ అస్సాం రాష్ట్రంలో కూడా రెండు పెద్ద విద్యుత్ ప్రాజెక్టుల కోసం దాదాపు రూ.63,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది. ఇందులో ఈశాన్య ప్రాంతంలోనే అతిపెద్ద బొగ్గు ఆధారిత ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్, కొత్త పంప్-స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఉన్నాయి. అదానీ పవర్ లిమిటెడ్ దాదాపు 3,200 మెగావాట్ల సామర్థ్యం గల ఈ థర్మల్ ప్లాంట్‌ను రూ.48,000 కోట్ల ఖర్చుతో నిర్మించనుంది.