AMARAVATHI: అమరావతిలో 9 థీమ్‌ల్లో 9 నగరాలు
భవిష్యత్తు నగరాన్ని నిర్మిస్తామన్న చంద్రబాబు... ఊపందుకోనున్న పనులు;
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో ఇప్పటివరకూ ఒకలెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క అని కూటమి ప్రభుత్వం చెప్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయడమే ఆలస్యం.. నిర్మాణ పనులను జెట్ స్పీడ్‌తో ప్రారంభించి పూర్తి చేయాలని డిసైడ్ అయింది. అమరావతిని స్వయం సమృద్ధి నగరంగా నిర్మించాలని సంకల్పించుకున్న ఏపీ ప్రభుత్వం... అందుకు అనుగుణంగా 8 వేల 603 చదరపు కిలోమీటర్ల పరిధిని రాజధాని ప్రాంతంగా గుర్తించారు. అందులో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నగరం నిర్మితమవుతుంది. 16.9 చ.కి.మీ. పరిధిలో కోర్ క్యాపిటల్‌ను డిజైన్ చేశారు. విశాలమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ పవర్ లైన్స్, నీటి వసతి, బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్‌తో ఆహ్లాదకరమైన ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రభుత్వం, న్యాయ, వైద్యం, పర్యాటకం, నాలెడ్జ్ ఫైనాన్స్, స్పోర్ట్స్, మీడియా, టూరిజం వంటి 9 కార్యకలాపాలపై దృష్టి సారించి 9 థీమ్‌ల్లో 9 నగరాలు ప్లాన్ చేశారు.
హ్యాపినెస్ ప్రాజెక్టు
అమరావతి రాజధాని నేలపాడులో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును రూ. 856 కోట్ల రూపాయల వ్యయంతో తొలి రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్టుగా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో జీ+18 అంతస్తులతో కూడిన 12 టవర్లను నిర్మించబోతున్నారు. మొత్తం 1200 అపార్ట్‌మెంట్లు ఉంటాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారుల నివాసాల కోసం భారీ బహుళ అంతస్తుల భవన సముదాయాల నిర్మాణాల బ్యాలెన్స్ పనులను 452 కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభించారు. మంత్రులు, హైకోర్టు జడ్జీల కోసం గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియాలో రూ. 419 కోట్ల వ్యయంతో జీ ప్లస్ 1లో మొత్తం 71 బంగ్లాల బ్యాలెన్స్ పనులు పూర్తి చేస్తారు.
ఫ్యూచర్ సిటీగా రాజధానిని నిర్మిస్తాం
ప్రధాని మోదీ చేతుల మీదగా జరిగిన రాజధాని అమరావతి పనుల పున: ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సహకారం, కేంద్ర మద్దతు, పక్కా ప్రణాళికతో, రాష్ట్రానికి చోదక శక్తిగా నిలిచేలా ఫ్యూచర్ సిటీగా రాజధాని అమరావతిని నిర్మిస్తామని ట్వీట్ చేశారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధిస్తామని, తమకు అండగా ఉన్న ప్రజల నమ్మకాన్ని నిలబెడతామని రాసుకొచ్చారు. అమరావతిలో అసెంబ్లీ రూ. 617 కోట్లతో ఐకానిక్ అసెంబ్లీ భవన నిర్మాణం చేపడుతున్నారు. బేస్‌మెంట్+గ్రౌండ్+3 ఫ్లోర్లతో ఈ భవనం నిర్మిస్తున్నారు. రాజధానిలో తాత్కాలిక హైకోర్టు స్థానంలో శాశ్వత ప్రాతిపదికన ప్రపంచస్థాయి ఐకానిక్ హైకోర్టు భవనాన్ని 786 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్నారు.