ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఐటీ రంగం విస్తరణ వేగవంతమవుతోంది. సింగపూర్ తరహాలో అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకుంటున్న అమరావతిలో, ముఖ్యంగా మంగళగిరి ప్రాంతం ఐటీ హబ్‌గా మారుతోంది. ఇప్పటికే ఇక్కడ పలు ఐటీ, బీపీఓ, కేపీఓ సంస్థలు, స్టార్టప్‌లు కార్యకలాపాలు ప్రారంభించాయి. రాష్ట్ర ప్రభుత్వం మంగళగిరిలో ప్రత్యేకంగా ఐటీ సెజ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు, పీఐ డేటా సెంటర్ వంటి భారీ మౌలిక వసతులను కల్పించింది. అంతర్జాతీయ సంస్థలు, స్టార్టప్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం భూముల కేటాయింపు, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తరహాలో మంగళగిరి అభివృద్ధి చెందే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈ ప్రాంతంలో నివాస, వాణిజ్య ప్రాజెక్టులకు డిమాండ్ భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టేవారికి ఇది చక్కటి అవకాశం అని రియల్ ఎస్టేట్ నిపుణులు పేర్కొంటున్నారు.
మరో రూ. 32,500 కోట్ల రుణం
రాజధాని అమరావతి నిర్మాణానికి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) మరో రూ.32,500 కోట్లు రుణం తీసుకోనుంది. ప్రపంచ బ్యాంకు- ఆసియా అభివృద్ధి బ్యాంకుల కన్సార్షియంతో పాటు ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఏపీపీఎఫ్‌సీ), నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ (ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ), నాబార్డ్ నుంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అసిస్టెన్స్ (ఎన్‌ఐడీఏ) కింద రుణం సమీకరించనుంది.
ఓఆర్ఆర్‌కు సంబంధించి...
అమరావతి ఓఆర్ఆర్‌కు సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. గుంటూరు జిల్లాలోని 11 మండలాల్లో భూసేకరణకు అడుగులు పడుతున్నాయి. 11 మండలాల్లోని 40 గ్రామాల్లో భూసేకరణకు కసరత్తు జరుగుతోంది. భూసేకరణ కోసం ప్రత్యేక అధికారిగా నియమించిన శ్రీవాత్సవ ఈ విషయంపై దృష్టి సారించారు. మరోవైపు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పనులను 12 ప్యాకేజీలుగా విభజించి చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. మరోవైపు మొత్తం ఐదు జిల్లాల్లో అమరావతి ఓఆర్ఆర్ కోసం భూసేకరణ చేపట్టనున్నారు.