AMARAVATHI: భూమి లేని పేదలకు పింఛన్..నెలకు రూ.5 వేలు
మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం... అమరావతిలో భూమి లేని పేదలకు పింఛన్లు... కసరత్తు చేస్తున్న సీఆర్డీఏ అధికార బృందం... పింఛన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న కమిటీ
రాజధాని అమరావతిలో భూమిలేని పేదలకు పింఛన్లు ఇవ్వటానికి సీఆర్డీఏ చర్యలు చేపట్టింది. త్రిసభ్య కమిటీ సమావేశంలో 4,929 మంది పింఛన్ల పునరుద్ధరణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. త్రిసభ్య కమిటీ నిర్ణయం మేరకు అర్హులైన వారికి నెలకు రూ.5 వేల పెన్షన్ ఇవ్వటానికి సీఆర్డీఏ ఏర్పాట్లు చేస్తోంది. రాజధానికి భూసమీకరణ జరిగిన సమయంలో భూమి లేని పేదలకు ఉపాధికి ఇబ్బంది లేకుండా పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పట్లో 4,929 మంది పేదలు పెన్షన్లు తీసుకునేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని పనులు నిలిపివేయటంతో పాటు.. పేదలకు పెన్షన్లు రద్దు చేసింది. ఇప్పుడు వారందరికీ పునరుద్దరించేందుకు సీఆర్డీఏ దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. గ్రామాల్లోని సీఆర్డీఏ కార్యాలయాల్లో పెన్షన్ దరఖాస్తులు ఇవ్వాలని కమిషనర్ కన్నబాబు ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామసభల సమయంలోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు. భూమి లేని పేదలకు న్యాయం చేస్తామని కమిషనర్ కన్నబాబు తెలిపారు.
త్రిసభ్య కమిటీ భేటీలో..
కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సమావేశంలో అమరావతిలో భూమి లేని పేదలకు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం 4,929 మందికి పింఛన్ల పునరుద్ధరణపై త్రిసభ్య కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. వీరికి నెలకు 5 వేల రూపాయలు చొప్పున పింఛన్ ఇచ్చేందుకు సీఆర్డీఏ చర్యలు ప్రారంభించింది. మరోవైపు అమరావతి రాజధానికి భూసమీకరణ చేసిన సమయంలో.. భూమి లేని పేద ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో పింఛన్ అందించాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే భూమి లేని 4,929 మంది పేదలకు పింఛన్లు అందించేవారు. అయితే ఆ తర్వాతి కాలంలో రాజధాని పనులు నిలిచిపోయాయి. కొంతమంది పేదలకు పింఛన్లు కూడా రద్దయ్యాయి. అయితే టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి రావటంతో వీరికి పింఛన్లు పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఇందుకోసం సీఆర్డీఏ దరఖాస్తులు స్వీకరించనుంది. అర్హులైన వారు గ్రామాల్లోని సీఆర్డీఏ కార్యాలయాల్లో పింఛన్ల కోసం దరఖాస్తులు ఇవ్వాలని సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు ఓ ప్రకటనలో వెల్లడించారు. గ్రామసభల సమయంలోనూ పింఛన్ల కోసం అర్జీలు సమర్పించవచ్చని సూచించారు. అమరావతి పరిధిలోని భూమి లేని పేదలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు అమరావతి కోసం గత టీడీపీ ప్రభుత్వం 33 వేల ఎకరాల భూమిని రైతుల నుంచి సమీకరించిన సంగతి తెలిసిందే. వారికి రిటర్నబుల్ ప్లాట్లతో పాటుగా కౌలు చెల్లింపులు చేస్తోంది. అయితే భూమి లేని పేదలకు కూడా పింఛన్లు అందించాలనే ఉద్దేశంతో 2015-16 మధ్యకాలంలో.. 29 గ్రామాల్లో 21,374 భూమి లేని కుటుంబాలను అప్పటి టీడీపీ ప్రభుత్వం గుర్తించింది. వారికి నెలకు రూ. 2,500 చొప్పున పింఛన్లు ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 2024 ఫిబ్రవరిలో ఈ పింఛన్ మొత్తాన్ని పెంచారు. 2 వేల 500 రూపాయల నుంచి 5 వేల రూపాయలకు పెంచారు. అయితే కరెంట్ బిల్లు సహా వివిధ సాంకేతిక కారణాలతో లబ్ధిదారుల సంఖ్యను కుదించారనే విమర్శలు ఉన్నాయి. అయితే 2024 ఎన్నికల్లో గెలిచి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భూమి లేని పేదలకు ఇచ్చే పింఛన్ల కాలపరిమితిని మరో ఐదేళ్లు పెంచారు.
అమరావతి రైతులకు శుభవార్త
అమరావతి రైతులకు ప్రభుత్వం ప్లాట్ల కేటాయింపుపై తీపికబురు చెప్పింది. రాయపూడి సీఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించారు.. రాజధాని రైతుల సమస్యలపై కమిటీ చర్చించింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సీఆర్డీఏ అధికారులు హాజరయ్యారు. అమరావతి ప్రాంత రైతుల సమస్యల పరిష్కారంపై సమావేశంలో ప్రధానంగా చర్చించామని మంత్రి నారాయణ తెలిపారు. వారి సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామన్నారు. అమరావతిలో రైతులకు కేటాయించిన ప్లాట్లలో ఇప్పటివరకు 61,793 ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయ్యిందని మంత్రి నారాయణ తెలిపారు. మరో 7628 ప్లాట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందన్నారు. 29,233 మంది రైతులకు ప్లాట్లు కేటాయించామని..312 కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి అన్నారు. అయితే ఉండవల్లిలో రాజధాని కోసం భూమి ఇచ్చిన రైతులకు త్వరలో లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయిస్తామని తెలిపారు. అమరావతిలోని R5 జోన్‌పై మాత్రం న్యాయ సలహా తీసుకుంటున్నామని తెలిపారు మంత్రి నారాయణ. జరీబు భూముల సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఒక నెల సమయం పడుతుందని చెప్పారు. నేల స్వభావం ఎలా ఉందో పరీక్షలు చేసి, ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.