LOKESH: మధ్యాహ్న భోజనంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
మంత్రి నారా లోకేశ్ హెచ్చరిక
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకం నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండకూడదని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. విద్యార్థులకు అందే భోజనం రుచిగా, శుచిగా, పోషకాహార ప్రమాణాలతో ఉండాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం లేదా అవకతవకలు చోటుచేసుకుంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ప్రభుత్వానికి ఈ పథకం అత్యంత ప్రాధాన్యమైనదని, దాన్ని సమర్థంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. అపర అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ’ పేరిట ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారాన్ని దృష్టిలో పెట్టుకుని చేపట్టిన కీలక కార్యక్రమమని మంత్రి అన్నారు. ఈ పథకాన్ని అపహాస్యం చేసేలా కుట్రపూరిత చర్యలు చేయడం గానీ, అమలులో నిర్లక్ష్యం చూపడం గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ఈ అంశంపై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి పలు ముఖ్యమైన ఆదేశాలు జారీ చేశారు.
విద్యార్థులకు భోజనం వడ్డించే ముందు ప్రతి రోజు ఒక ఉపాధ్యాయుడు ఆహారాన్ని రుచి చూసి దాని నాణ్యతను నిర్ధారించాలని ఆయన సూచించారు. భోజనం పరిశుభ్రంగా, నాణ్యంగా ఉండేలా ప్రత్యేకంగా పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి సెంట్రలైజ్డ్ కిచెన్ వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని కూడా మంత్రి సూచించారు. అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. ప్రతి వారం ఒక రోజు స్థానిక ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని సూచించారు. ఇలా చేస్తే భోజన నాణ్యతపై ప్రత్యక్షంగా అవగాహన ఏర్పడుతుందని తెలిపారు.
ఇటీవల మైలవరం ఘటనకు సంబంధించి జరుగుతున్న కొన్ని కుట్రపూరిత ప్రచారాలను కూడా మంత్రి ఖండించారు. అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకంలో ఏవైనా లోపాలు ఉన్నాయనే భావన కలిగితే తల్లిదండ్రులు తమ ఫిర్యాదులను నేరుగా ‘లీప్’ (LEAP) యాప్ ద్వారా తెలియజేయవచ్చని లోకేశ్ తెలిపారు. విద్యార్థులకు మంచి ఆహారం అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని మంత్రి మరోసారి స్పష్టం చేశారు