అమరావతిలో సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 13వ తేదీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సీఆర్డీఏ ఆఫీసు ప్రారంభం కానుంది. ఉదయం 9:54 నిమిషాలకు సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం ప్రారంభోత్సవం జరగనుంది. సీఆర్డీఏ ప్రాజెక్టు ఆఫీసును మొత్తం ఏడు అంతస్తులలో నిర్మించారు. 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో నిర్మాణం ప్రారంభం కాగా.. మధ్యలో అధికారం చేతులు మారటంతో పనుల్లో జాప్యం జరిగింది. ఎట్టకేలకు నిర్మాణం పూర్తి చేసుకున్న సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం.. ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే రాయపూడి సమీపంలో సీఆర్డీఏ కార్యాలయం నిర్మించారు. ఆకట్టుకునే ఇంటీరియర్ డిజైన్స్, ఆధునిక నిర్మాణ శైలితో సీఆర్డీఏ ఆఫీసు నిర్మించారు. ఈ కార్యాలయం అందుబాటులోకి వచ్చిన తర్వాత సీఆర్డీఏ కార్యకలాపాలువిజయవాడ నుంచి అమరావతికి మారనున్నాయి. 2014 టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఆర్డీఏ ఆఫీసు పనులు ప్రారంభించారు. 2019 నాటికి గ్రౌండ్ ఫ్లోర్, ఏడు అంతస్తుల స్ట్రక్చర్ పూర్తి చేశారు.
ఏపీలో రోడ్లకు మహర్దశ
ఏపీలో రోడ్లు అధ్వాన్నంగా మారాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై భారీగా గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో ఆస్పత్రుల పాలయ్యారు. దీంతో కొత్త రోడ్లతో పాటు మరమ్మతులు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా రోడ్లను పట్టించుకోవడంలేదనే విమర్శలు తీవ్రమయ్యాయి.ఈ నేపథ్యంలో ప్రభుత్వం రోడ్లపై దృష్టి పెట్టింది. రోడ్లు, భవనాల శాఖ అధికారులతో చర్చించింది. మొత్తం 274 రోడ్ల పనులు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రూ. 1000 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఇందుకు అవసరమైన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దెబ్బతో రాష్ట్రంలోని రోడ్లన్ని బాగుపడనున్నాయని కూటమి నేతలు తెలిపారు. గత ప్రభుత్వంలో రోడ్లను పట్టించుకోలేదని, తమ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని సమస్యలను పరిష్కరిస్తోందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలుపై దృష్టి పెట్టింది. రోడ్లపై విమర్శలు వస్తున్న వేళ వాటిని మెరుగు పర్చాలని సర్కార్ కంకణం కట్టుకుంది.