AMARAVATHI: అమరావతి నిర్మాణంలో నేడు మహా ఘట్టం
నేడు 25 బ్యాంకు భవనాలకు శంకుస్థాపన... భూమి పూజ చేయనున్న నిర్మలా సీతారామన్... సీఆర్డీఏ ప్రాంగణంలో వర్చువల్‌గా శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఆర్థిక, వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. నేడు అమరావతిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా 25 ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యాలయాలు, సంస్థలకు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు, అధికారులు హాజరవుతారు.ఇవాళ ఉదయం 11.10 గంటల నుంచి 12.25 మధ్య సీఆర్డీఏ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో నిర్మించిన పురపాలక శాఖకు చెందిన భవనం వేదికగా వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, రాయపూడి, వెలగపూడి, నేలపాడు, ఐనవోలు పరిధిలో ఆయా సంస్థలు, బ్యాంకులు ఏర్పాటు కానున్నాయి. ఈ కార్యక్రమం గత నెలలోనే జరగాల్సి ఉన్నా మొంథా తుపాను కారణంగా వాయిదా పడింది. ఈ కార్యాలయాలన్నీ అందుబాటులోకి వస్తే అమరావతి పెద్ద ఆర్థిక కేంద్రంగా మారుతుందని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ, ఎల్ఐసీ, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఇన్కమ్ ట్యాక్స్, కెనరా బ్యాంక్, ఏపీ కోపరేటివ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓవర్సీస్ బ్యాంక్, కోస్టల్ ఏరియా బ్యాంక్, ఐడీబీఐ, ఏపీ కోపరేటివ్ బ్యాంకులు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నాయి.
హాజరుకానున్న నిర్మలా సీతారామన్
ఈకార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు హాజరవుతారని తెలుస్తోంది. అమరావతిని ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో.. ఇప్పటికే కూటమి ప్రభుత్వం.. వివిధ బ్యాంకులకు అవసరమైన భూములను కేటాయించింది. శంకుస్థాపన కార్యక్రమం ముగిస్తే.. అవి నిర్మాణ పనులు ప్రారంభిస్తాయి అంటున్నారు. ఈ బ్యాంకుల భవనాలు నిర్మించడం కోసం ఇప్పటికే వీటికి ఉద్దండరాయునిపాలెం వద్ద స్థలాలు కేటాయించారు. చాలా బ్యాంకుల ఆ స్థలాన్ని బాగు చేసుకుని.. నిర్మాణం ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాయి. సభా వేదికపై నుంచి ఒకేసారి అన్ని బ్యాంకుల భవనాలకు శంకుస్థాపన జరుగుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కార్యాలయానికి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఈ బ్యాంకుల భవనాల నిర్మాణాలకు 2014-19 మధ్యలోనే స్థలాలు కేటాయించారు. కానీ అప్పుడది ముందుకు సాగలేదు. అమరావతిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు 3 ఎకరాల స్థలం కేటాయించారు. ఎస్బీఐ ఇక్కడ 14 అంతస్తులు బిల్డింగ్ నిర్మించబోతుంది. అలానే బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ , ఇండియన్ బ్యాంక్, ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, పీఎన్బీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలతో పాటుగా బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన భవనాల నిర్మాణం ఒకేసారి మొదలుకానుంది. ఈ బిల్డింగుల్లోనే ఆయా బ్యాంకుల రాష్ట్ర ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేయబోతున్నారు.