CBN: అమరావతి ఎదుగుదలను ఎవరూ ఆపలేరు
విజయవాడలో ‘అమరావతి-ఆవకాయ’ ఫెస్టివల్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు... అమరావతి అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ అంటే ప్రపంచానికి గుర్తుకు వచ్చేది ఒక ప్రత్యేకమైన గుర్తింపు. ఆ గుర్తింపులో సంస్కృతి ఉంది… చరిత్ర ఉంది… రుచుల పరిమళం ఉంది… కళలు ఉన్నాయి… సృజనాత్మకత ఉంది. ఈ సమస్తాన్ని ఒకే వేదికపై ఆవిష్కరిస్తూ ‘అమరావతి–ఆవకాయ ఫెస్టివల్ 2026’ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని, సంప్రదాయ వైభవాన్ని, వంటకాల విశిష్టతను ప్రపంచానికి మరోసారి గుర్తు చేసేలా ఈ ఉత్సవం రూపుదిద్దుకుంది. విజయవాడ వేదికగా నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక ఉత్సవానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. సంప్రదాయ సంగీతం, నృత్యాలు, ఆంధ్ర వంటకాల ప్రదర్శనలు, సినీ కళాకారుల సందడి మధ్య ఈ ఫెస్టివల్ తొలి రోజే విశేష ఆకర్షణగా నిలిచింది. ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు… ఆవకాయ అనగానే ప్రపంచవ్యాప్తంగా ముందుగా గుర్తుకు వచ్చేది ఆంధ్రప్రదేశ్‌నే అని స్పష్టం చేశారు. ఆంధ్ర వంటకాలకు ఉన్న ప్రత్యేకత, రుచుల వైభవం భారతదేశానికే కాదు… ప్రపంచానికే ఆదర్శమని అన్నారు. అలాంటి గొప్పతనాన్ని తరతరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిదేనని పేర్కొన్నారు.
వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే....
తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే లక్ష్యంతోనే ఇలాంటి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు. భక్త ప్రహ్లాద వంటి పౌరాణిక చిత్రాల నుంచి బాహుబలి వంటి అంతర్జాతీయ స్థాయి సినిమాల వరకు తెలుగు చిత్రసీమ ఎన్నో అద్భుత ప్రయోగాలు చేసిందని గుర్తుచేశారు. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, శోభన్‌బాబు వంటి మహానటులు తెలుగు సినిమాకు దిక్సూచి చూపారని, నేటి తరం నటులు కూడా అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ సినిమాను మరింత ఎత్తుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, వంటకాలు, సృజనాత్మక రంగాలను ప్రోత్సహించేలా ఈ ఫెస్టివల్‌లో మొత్తం 28 ప్రత్యేక ఈవెంట్లు, 4 వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆవకాయ తయారీ పద్ధతుల నుంచి ఆధునిక ఫుడ్ స్టార్టప్‌ల వరకు, సంప్రదాయ కళల నుంచి ఆధునిక సాంకేతికత వరకు అన్ని రంగాలకు ఈ ఉత్సవంలో ప్రాధాన్యం కల్పించారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో పండుగల సందడి, సంబరాల వాతావరణం తగ్గిపోయిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజల ముఖాల్లో నవ్వులు మాయమయ్యాయని, కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ ఉత్సవ్, అమ్మవారి దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించి రాష్ట్రానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ఒకప్పుడు దసరా అంటే మైసూరు లేదా కలకత్తా గుర్తుకు వచ్చేదని, ఇప్పుడు దసరా అంటే విజయవాడ గుర్తుకు వచ్చే స్థాయికి ఉత్సవాలను తీసుకువచ్చామని తెలిపారు.
సంపద సృష్టిలో వాళ్లే...
కృష్ణాజిల్లా ప్రజల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన సీఎం… సంపద సృష్టిలో, వ్యాపార రంగంలో ఈ జిల్లా ప్రజలు ఎప్పుడూ ముందుంటారని ప్రశంసించారు. ఇక్కడివారు చేయని వ్యాపారం లేదని, ఒకప్పుడు శారీరక శ్రమతో కష్టపడి పనిచేసిన ప్రజలు ఇప్పుడు హార్డ్‌వర్క్‌తో పాటు స్మార్ట్‌వర్క్‌ను కూడా అలవర్చుకున్నారని అన్నారు. తెలుగు ప్రజల గ్లోబల్ స్థాయిలో సాధించిన విజయాలను గుర్తు చేసిన చంద్రబాబు… ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా తెలుగు వారు తమ భాషను, ప్రతిభను చాటి చెబుతూ స్థిరపడుతున్నారని గర్వంగా చెప్పారు. 25 ఏళ్ల క్రితమే ఐటీ విద్య ప్రాధాన్యతను గుర్తించి విద్యార్థులను ఆ దిశగా ప్రోత్సహించామని, నేటి తరం యువత ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తూ దేశానికి పేరు తీసుకొస్తోందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా తమ విజన్‌ను వివరించిన సీఎం… విశాఖపట్నాన్ని ఏఐ హబ్‌గా అభివృద్ధి చేస్తామని, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ద్వారా ఆధునిక ఇంధన సాంకేతికతను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే భయాలు అవసరం లేదని, టూరిజం, సాంకేతిక రంగాల అభివృద్ధి ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చని స్పష్టం చేశారు.