AMARAVATHI: నమో అమరావతి

అమరావతి పున:ప్రారంభ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన...రూ. 49,040 కోట్ల పనులు ఆరంభించిన ప్రధాని;

Update: 2025-05-03 03:00 GMT

అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్‌కు ఏపీ గ్రోత్‌ ఇంజిన్‌గా ఎదగాలని ప్రధాని ఆకాంక్షించారు. అమరావతి పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. అమరావతి నిర్మాణానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామన్న ప్రధాని.. రాష్ట్రంలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలవుతుందని వ్యాఖ్యానించారు. తన ప్రసంగాన్ని తెలుగులో మొదలు పెట్టిన ఆయన.. ‘‘దుర్గాభవానీ కొలువైన ఈ పుణ్య భూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అని స్పష్టం చేశారు. అమరావతి అంటే ఒక కల కాదని.. ఒక నిజమని మోదీ అన్నారు. ఏపీ ప్రజలు నయా అమరావతిని చూడబోతున్నారన్నారు. అమరావతి స్వప్నం త్వరలోనే సాకారం కానుందని చెప్పారు. ఇది బౌద్ధ వారసత్వం, ప్రగతి కలగలిసిన ప్రాంతం అని ప్రధాని ఉద్ఘాటించారు. అమరావతి నిర్మాణంతో ఆంధ్ర‌ప్రదేశ్.. అధునాతన ప్రదేశ్‌గా మారనుందని స్పష్టం చేశారు. ఐటీ రంగంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునే తాను ఫాలో అయ్యానని ప్రధాని మోదీ వెల్లడించారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో కూర్చుని ఐటీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం తనకు గుర్తుందన్నారు. తాను కూడా ఐటీలో చంద్రబాబు మోదీ ఏం చేస్తున్నారో.. చూసేవాడినని అన్నారు.

మనం చేయాలి.. మనమే చేయాలి

అమరావతి నిర్మాణం మనం చేయాలి.. మనమే చేయాలని ప్రధాని మోదీ చాలా స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు-పవన్కల్యాణ్-తాను కలిసి అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని మోదీ వెల్లడించారు. పదేళ్లు అమరావతి కోసం కేంద్రం ఎంతో సాయం చేసిందన్న మోదీ.. అమరావతిలో జరిగేవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు కావన్నారు.ఐటీ, ఏఐ, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ ఇండస్ట్రీల్లో అమరావతి ప్రధాన నగరంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. శ్రీహరికోట నుంచి జరిగే ప్రయోగాలు దేశం మొత్తాన్ని గర్వపడేలా చేస్తున్నాయన్న మోదీ.. ఆయుధాలే కాదు ఐకమత్యమే మన బలం అని పేర్కొన్నారు. అనంతరం అమరావతి భవిష్యత్తు వీడియో రూపంలో కళ్లకు కట్టారు. అమరావతిలో ఎంత ఖర్చుతో ఏ నిర్మాణం చేపడతారో సవివరంగా ఆ వీడియోలో వివరించారు.

కనెక్టివిటీకి కొత్త అధ్యాయం

ఏపీలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలవుతుందని ప్రధానిమోదీ అన్నారు. రైల్వే ప్రాజెక్టులతో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు, మరో రాష్ట్రానికి అనుసంధానం పెరుగుతుందని మోదీ వెల్లడించారు. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్‌ రూ.900 కోట్లలోపే ఉండేదన్న మోదీ... ఇప్పుడు కేవలం ఏపీకే రూ.9వేల కోట్ల రైల్వే నిధులు ఇచ్చామని గుర్తు చేశారు. గత పదేళ్లలో ఏపీలో 750 రైల్వే బ్రిడ్జ్‌లు, అండర్‌పాస్‌లు నిర్మించామన్నారు. వందేభారత్‌, అమృత్‌ భారత్‌ రైళ్లు కేటాయించాం. ఏపీలో 70కి పైగా రైల్వే స్టేషన్లను అమృత్‌ భారత్‌ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తున్నామన్నారు.

Tags:    

Similar News