Amit Shah: ఏపీలో మాదకద్రవ్యాల వినియోగంపై స్పందించిన అమిత్ షా..
Amit Shah: మాదకద్రవ్యాల వినియోగం జీవితాల్ని నాశనం చేస్తోందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఆందోళన వ్యక్తం చేశారు.;
Amit Shah (tv5news.in)
Amit Shah: మాదకద్రవ్యాల వినియోగం జీవితాల్ని నాశనం చేస్తోందని, యువతను నిర్వీర్యం చేస్తోందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టేందుకు ముఖ్యమంత్రులు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. తిరుపతిలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షన జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ, కర్నాటక, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తమిళిసై కూడా సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా 26 అంశాలపై చర్చించారు. ఇక తమిళనాడు, కేరళ, తెలంగాణ సీఎంలు సమావేశానికి దూరంగా ఉండగా, ఆ రాష్ట్రాల నుంచి మంత్రులు, ముఖ్య అధికారులు హాజరయ్యారు. గత సమావేశంలో తీసుకున్న రెండు నిర్ణయాలపై కౌన్సిల్ చర్చించింది. కొత్తగా 24 అంశాలపై చర్చకు ఆమోదం తెలిపింది.
ఏపీ నుంచి ఏడు అంశాలపై చర్చ జరిగింది. మూడు రాజధానుల సమగ్రాభివృద్ధికి ఉదారంగా నిధులివ్వాలని ఏపీ కోరింది. అలాగే ఏపీకి కొత్త రాజధాని అభివృద్ధి నిధుల్లో పెండింగ్‌లో ఉన్న వెయ్యి కోట్లు ఇవ్వాలని సీఎం జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరారు. మహిళలు, బాలలపై జరిగే నేరాల దర్యాప్తును 60 రోజుల్లోగా పూర్తి చేయాలన్న నిబంధనను కచ్చితంగా పాటించాలని చెప్పారు.
పోక్సో చట్టం కింద నమోదైన కేసుల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని, ఆ నేరాలను ఏ మాత్రమూ ఉపేక్షించొద్దని నిర్దేశించారు. ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల సవరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని.. ఆ సవరణల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి నివేదికలివ్వాలని అమిత్ షా సూచించారు. విచారణల వేగవంతానికి రాష్ట్రాలు డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రధాని మోదీ చొరవతో ఇప్పటికే జాతీయ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయం, రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయం ఏర్పాటయ్యాయని అమిత్‌షా చెప్పారు. ప్రతి రాష్ట్రం కనీసం ఒక్క ఫోరెన్సిక్ సైన్స్ కళాశాలనైనా ఏర్పాటు చేయాలని, వాటిలో సిలబస్ స్థానిక భాషలో ఉండాలన్నారు.