AP News: జెత్వానీ అక్రమ అరెస్టు కేసులో ముగ్గురు జగన్ భక్త ఐపీఎస్ అధికారులపై వేటు
డీజీపీ సమగ్ర నివేదికలో బయటపడిన నిజాలు;
ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతి రాణా తాతా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిలను సస్పెండ్ చేస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ముంబయి నటి కాదంబరి జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్‌లపై అభియోగాలున్నాయి.
నాటి ఇంటెలిజెన్స్ డీజీ పి.సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా తాతా, డిప్యూటీ పోలీస్ కమిషనర్ విశాల్ గున్నిలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గత ప్రభుత్వంలో ‘ముఖ్య’నేతకు సన్నిహితుడైన పారిశ్రామికవేత్తను కాపాడేందుకు ఒక మహిళను, ఆమె కుటుంబాన్ని అక్రమ కేసులో ఇరికించి, అడ్డగోలుగా వ్యవహరించిన పాపానికి ఫలితమిది. ఒకే కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఒకేసారి సస్పెండ్ కావడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. నటి అరెస్టుకు ముఖ్యమంత్రి కార్యాలయంలోనే కుట్రకు పథక రచన చేసినట్లు తేలింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో ఈ ముగ్గురు ఐపీఎస్‌లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, అధికార దుర్వినియోగంతో పాటు తీవ్ర దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇచ్చారు. ఈ కేసులో సాక్షులు, సహచరులను ప్రభావితం చేయగల సామర్థ్యమున్న వీరు.. ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని, అందులో భాగంగా ముంబయికి కూడా వెళ్లారని పేర్కొన్నారు. డీజీపీ నివేదికను పరిగణనలోకి తీసుకొని, ముగ్గురిని సస్పెండ్ చేస్తూ సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ ఆదివారం వేర్వేరు ఉత్తర్వులిచ్చారు.
విజయవాడ సీపీ కాంతిరాణా తాతా, డీసీపీ విశాల్ గున్నిలను 2024 జనవరి 31న నాటి ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు సీఎంవోకు పిలిచి మాట్లాడారు. ముంబయికి చెందిన సినీ నటి కాదంబరి నరేంద్రకుమార్ జెత్వానీని అరెస్టు చేయాలని చెప్పారు. అప్పటికి ఆమెపై ఎలాంటి కేసూ లేదు. ఫిబ్రవరి 2న ఉదయం 6.30కు ఆమెపై కేసు నమోదైనట్లు రికార్డులు సూచిస్తున్నాయి. అంటే కేసు నమోదుకు ముందే, ఆమె అరెస్టుకు పీఎస్‌ఆర్ ఆదేశాలిచ్చినట్లు స్పష్టమవుతోంది.
డీజీ చెప్పిన నోటిమాటతో నాటి సీపీ కాంతిరాణా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. కాదంబరి అరెస్టుకు ఆదేశించడంతో పాటు ఎఫ్‌ఐఆర్ నమోదుకు ఒకరోజు ముందే విమాన టికెట్లు బుక్ చేయించడంలో కాంతిరాణా పాత్ర ఉంది.ఇంటెలిజెన్స్ డీజీ చెప్పారన్న ఏకైక కారణంతో కేసు పూర్వాపరాలు పరిశీలించకుండా హడావుడిగా ముంబయి వెళ్లి జెత్వానీని అరెస్టు చేసి, నాటి డీసీపీ విశాల్ గున్ని విధి నిర్వహణలో ఘోరమైన దుష్ప్రవర్తనకు పాల్పడ్డారు.