సంచలనం రేపుతున్న స్నేహలత దారుణ హత్య
డ్యూటీ ముగించుకుని వస్తున్న స్నేహలతను అత్యంత దారుణంగా చంపేశారు దుండగులు. ధర్మవరం నుంచి అనంతపురం వస్తున్న స్నేహలతను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేశారు.;
అనంతపురంలో స్నేహలత దారుణహత్య అచ్చం దిశ ఘటననే గుర్తుకు తెస్తోంది. డ్యూటీ ముగించుకుని వస్తున్న స్నేహలతను అత్యంత దారుణంగా చంపేశారు దుండగులు. ధర్మవరం నుంచి అనంతపురం వస్తున్న స్నేహలతను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేశారు. ఆ తరువాత పొట్ట కింద భాగంలో నిప్పు అంటించారు. దీంతో స్నేహలత శరీర భాగం కొంత కాలింది. యువతిని చంపి, నిప్పు అంటించడం చూస్తుంటే దిశ ఘటనను తలపిస్తోంది.
అనంతపురంలోని అశోక్‌నగర్‌లో ఉంటున్న స్నేహలత పది రోజుల కిందటే ఉద్యోగంలో చేరింది. హాకీ క్రీడాకారిణి అయిన స్నేహలతను కొంతకాలంగా రాజేశ్ వేధిస్తుండడంతో ప్రాక్టీస్ వదిలిపెట్టి ధర్మవరంలోని ఎస్‌బీఐలో ఉద్యోగంలో చేరింది. ప్రతి రోజు లాగే మంగళవారం సాయంత్రం డ్యూటీ ముగించుకుని బయటకొచ్చింది. ఆరున్నరకు తండ్రికి ఫోన్ చేసి గంటలో ఇంటికి వస్తానని చెప్పింది. ఏడున్నర అయినా రాకపోవడంతో స్నేహలతకు తండ్రి ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్చాఫ్ రావడం, స్నేహలత ఇంటికి రాకపోవటంతో విషయం తన భార్యకు చెప్పారు.
రాజేశ్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమ పేరిట వేధిస్తుండటంతో ఆమె తల్లిదండ్రులు మొదట అతనినే అనుమానించారు. రాత్రి 9 గంటల సమయంలో రాజేశ్ ఇంటికి వెళ్లి తన కూతురిని ఏం చేశావో చెప్పమంటూ నిలదీశారు. తనకు తెలియదని రాజేశ్ సమాధానం ఇవ్వడంతో రాత్రి తొమ్మిదిన్నరకు అనంతపురం వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కూడా సరిగా స్పందిచలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అమ్మాయేం చిన్న పిల్ల కాదు కదా వచ్చేస్తుందిలే.. ఉదయం రండి వెతుకుదాం అంటూ పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని స్నేహలత తల్లిదండ్రులు చెబుతున్నారు.
భవన నిర్మాణ కార్మికుడుగా పనిచేస్తున్న రాజేశ్ అనే యువకుడే స్నేహలతను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు స్నేహలతను ధర్మవరం గాంధీ సర్కిల్ వద్ద బైక్‌పై బలవంతంగా ఎక్కించుకున్నాడని, అనంతపురం వెళ్లేందుకు షార్ట్‌కట్ రూట్ అయిన బడన్నపల్లి పొదలవైపుగా తీసుకెళ్లాడని పోలీసులు చెబుతున్నారు. అక్కడే గొంతు నులిమి చంపేసి ఆనవాళ్లు కనిపించకుండా చేయాలనే ఉద్దేశంతో స్నేహలత సంచిలో ఉన్న కాగితాలు తీసుకొని ఆమె పొట్ట భాగంపై వేసి నిప్పు అంటించాడని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం రాజేశ్ పోలీసుల అదుపులో ఉన్నాడు. నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది.
గత నెల రోజుల వ్యవధిలో నిందితుడు రాజేశ్, స్నేహలత మధ్య 1600 కాల్స్, 300 ఎస్‌ఎంఎస్‌లు నడిచాయని పోలీసులు చెబుతున్నారు. హత్య జరిగిన రోజు కూడా దాదాపు 16 కాల్స్ ఉన్నట్లు చెబుతున్నారు. స్నేహలత తనను దూరం పెట్టి మరొకరితో చనువుగా ఉంటుందనే అనుమానంతోనే కక్ష పెంచుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
రాజేశ్ ఒక్కడే ఈ దారుణానికి ఒడిగట్టాడా? ఇంకెవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యచేసిన ప్రాంతం నుంచి నిందితుడి ఇంటికి 40 నిమిషాల్లో చేరుకోవొచ్చు. దీంతో చంపిన వెంటనే ఇంటికొచ్చేసిన రాజేశ్.. తన స్నేహితుడితో కలిసి మద్యం తాగినట్లు తెలుస్తోంది. అదే సమయంలో స్నేహలత తల్లి రాజేశ్‌ను నిలదీయడానికి వచ్చింది. కాని, తనకేమీ తెలియదని చెప్పడంతో.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
స్నేహలత హత్య మంగళవారం రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య జరిగింది. కానీ బుధవారం ఉదయం పదకొండున్నర వరకు పోలీసులు ఈ విషయం గుర్తించలేకపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బడన్నపల్లి సమీపంలోని కందిచేను వద్ద యువతి మృతదేహం కాలిపోయిన స్థితిలో ఉందని ఎవరో సమాచారమిస్తే అప్పటికప్పుడు పోలీసులు అక్కడికి వెళ్లారు. గుర్తింపు కార్డు ఆధారంగా మృతురాలిని స్నేహలతగా గుర్తించారు.
అయితే ఫిర్యాదు వచ్చిన వెంటనే తాము ఆమె సెల్ నంబర్ ఆధారంగా టవర్ లొకేషన్ గుర్తించగా.. ధర్మవరంలో ఉన్నట్లు తేలిందని పోలీసులు చెబుతున్నారు. వెంటనే ప్రత్యేక బృందాలుగా వీడి గాలింపు చేపట్టామని చెప్పారు. పోలీసులు వెంటనే స్పందించి ఉంటే ఉదయం పదకొండున్నర గంటలకు ఎవరో చెప్పేవరకూ ఎందుకు గుర్తించలేకపోయారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ప్రేమ పేరుతో రాజేశ్ ఎంతోకాలంగా వేధిస్తున్నాడని అనంతపురం వన్‌టౌన్ పోలీసులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేశామంటున్నారు స్నేహలత తల్లిదండ్రులు. రెండు నెలల కిందట కూడా కంప్లైంట్ ఇచ్చామని చెప్పారు. నిందితుడు రాజేశ్.. స్నేహలత పేరును పచ్చబొట్టు వేయించుకున్నాడని, తమ ఇంటి ముందు బైక్‌పై తిరిగేవాడని పోలీసులకు చెప్పామని చెబుతున్నారు. చివరికి దిశా యాప్‌లో కూడా ఫిర్యాదు చేశామని, కాని పోలీసులు మాత్రం ఇల్లు మారితే ఏ సమస్యలు ఉండవు కదా అంటూ సలహా ఇచ్చారే తప్ప.. చర్యలు తీసుకోలేదని స్నేహలత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే పోలీసులు మాత్రం రాజేశ్‌పై ఏడాదిన్నరలో ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదని చెబుతున్నారు. మంగళవారం రాత్రి స్నేహలత కనిపించట్లేదని మాత్రమే ఫిర్యాదు చేశారని, వెంటనే ఆమె సెల్ నెంబర్ ఆధారంగా టవర్ లొకేషన్ పరిశీలించామని చెప్పారు. ధర్మవరంలో ఉన్నట్లు తేలడంతో ధర్మవరం పోలీసులను అప్రమత్తం చేశామని, నిందితుడు రాజేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు. హత్య సమయంలో రాజేశ్‌తో పాటు ఉన్నాడని అనుమానిస్తున్న కార్తీక్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.