కేంద్ర ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, గుంటూరుకు అవార్డులు దక్కాయి. జాతీయ స్థాయిలో స్పెషల్ కేటగిరీ మినిస్టీరియల్ అవార్డును విశాఖ నగరం దక్కించుకుంది. రాష్ట్ర స్థాయిలో మినిస్టీరియల్ అవార్డుకు రాజమహేంద్రవరం ఎంపికైంది. స్వచ్ఛ సూపర్‌లీగ్ సిటీస్ విభాగంలో విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాలు ఎంపికయ్యాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులకు ఎంపిక కావడంపై ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ స్పందించారు. సీఎం చంద్రబాబు చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల వల్లే ఈ అవార్డులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కృషి చేసిన అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.