AP: కొత్త జిల్లాల్లో పరిపాలన షురూ..
కలెక్టర్లు, ఎస్పీలను నియమించిన సర్కార్... ఏపీలో అమల్లోకి వచ్చిన కొత్త జిల్లాలు... పోలవరం కలెక్టర్‌గా A S దినేష్ కుమార్... మార్కాపురం కలెక్టర్‌గా రాజబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యు డివిజన్లు ఏర్పాటు, పలు మండలాల సరిహద్దులు మార్పులు చేర్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. రంపచోడవరం హెడ్ క్వార్టర్‌గా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్కాపురం హెడ్ క్వార్టర్‌గా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. కొత్త జిల్లాలు అమల్లోకి వస్తాయని తుది నోటిఫికేషన్లలో తెలిపింది. 2 కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 26 నుంచి 28కి పెరిగింది. మదనపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చిన నేపథ్యంలో అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్‌ను రాయచోటి నుంచి మదనపల్లికి మార్చారు. ప్రజలకు వేగంగా పాలన అందించడం, సుపరిపాలనే లక్ష్యంగా రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లనూ ఏర్పాటు చేసింది. పలు మండలాల సరిహద్దులనూ మార్చింది. ప్రజల కోరిక మేరకు సమీప జిల్లాల్లో కలిపింది. కొత్తగా రెవెన్యూ డివిజన్లుగా అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్, ప్రకాశం జిల్లాలో అద్దంకి, అన్నమయ్య జిల్లాలో పీలేరు, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిర, నంద్యాల జిల్లాలో బనగానపల్లి రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది.
కలెక్టర్, ఎస్పీ నియామకం
కొత్తగా ఏర్పాటైన పోలవరం, మార్కాపురం జిల్లాల్లో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. పోలవరం కలెక్టర్ గా అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ A S దినేష్ కుమార్ కు ఇంచార్జ్ విధులు నిర్వహించనున్నారు. ఇక మార్కాపురం కలెక్టర్ గా ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు కు అదనపు బాధ్యతలు అప్పగించారు. పోలవరం ఎస్పీ గా అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్డర్‌కు అదనపు బాధ్యతలు అందించారు. మార్కాపురం ఎస్పీ గా ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు, పోలవరం జాయింట్ కలెక్టర్ గా అల్లూరి జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ కు అదనపు బాధ్యతలు అందించారు. మార్కాపురం జాయింట్ కలెక్టర్ గా ప్రకాశం జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ కు ఇంచార్జ్ బాధ్యతలు ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం ఆయా జిల్లాల్లో కలెక్టర్, జేసీ, ఎస్పీ కార్యాలయాలను నోటిఫై చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.
కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జేసీలు వచ్చేదాకా ఉమ్మడి జిల్లా అధికారులే ఇన్చార్జులుగా కొనసాగనున్నారు. డిసెంబర్ 31 నుంచి అన్నమయ్య జిల్లా కార్యకలాపాలు మదనపల్లి కార్యక్రమాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు రాయచోటి నుంచి పనిచేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర జిల్లా అధికారుల కార్యాలయాలు నేటి నుంచి మదనపల్లె నుంచి జరుగుతాయి. గత వైసీపీ ప్రభుత్వం జిల్లాల విభజన చేపట్టగా.. అందులో పొరపాట్లు ఉన్నాయని టీడీపీ ప్రభుత్వం ఆరోపించింది. తాము అధికారంలోకి వచ్చాక మార్పులు చేస్తామని తెలిపింది. అందుకు అనుగుణంగా ఇప్పుడు కొత్త జిల్లాలతో పాటు కొన్ని జిల్లాల కేంద్రాల్లో మార్పులు చేసింది.
సరిహద్దులు మార్పులు
సరిహద్దుల మార్పులకు సంబంధించి తుది ప్రకటన జారీ చేసింది. 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో వాటి సంఖ్య 77 నుంచి 82కు చేరాయి. కొత్తగా 2 కొత్త మండలాలను ఏర్పాటు చేశారు. ఆదోని 1, ఆదోని 2 మండలాల ఏర్పాటుతో రాష్ట్రంలో మండలాల సంఖ్య 679 నుంచి 681కి పెరిగాయి. పెనుగొండ మండలాన్ని వాసవీ పెనుగొండగా మార్చారు. నందిగామ మండలాన్ని పలాస రెవెన్యూ డివిజన్ నుంచి టెక్కలికి మార్చారు. సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దపురానికి మార్చారు. పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా రీస్ట్రక్చర్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. పెనుగొండను వాసవీ పెనుగొండగా మారుస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేశారు. ఇప్పటి వరకు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మండపేట నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలో భాగమవుతుంది. ఈ నియోజకవర్గంలోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలు రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్ నుంచి రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్లో విలీనమవుతాయి.
అద్దంకి కొత్త రెవెన్యూ డివిజన్
బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో విలీనం చేస్తున్నారు. అద్దంకి కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటవుతోంది. ఇందులో అద్దంకి, దర్శి నియోజకవర్గాలు ఉంటాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం రెవెన్యూ డివిజన్‌తోపాటు ప్రకాశం జిల్లాలో విలీనమవుతుంది. గూడూరు నియోజకవర్గంలోని మూడు మండలాలు డివిజన్‌తో సహా తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో కలుస్తాయి.