AP: ఏపీ లిక్కర్ స్కాం.. 8 చోట్ల ఈడీ సోదాలు
వైఎస్ అనిల్‌రెడ్డి కంపెనీల్లో సిట్ సోదాలు
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం సంభవించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరుడైన వైఎస్ అనిల్‌రెడ్డి కి సంబంధించిన కంపెనీల కార్యాలయాలు, నివాసాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. మద్యం ముడుపుల సొమ్మును విదేశాలకు తరలించేందుకు ఈ కంపెనీలను వాడుకున్నారని అనుమానిస్తున్న సిట్ అధికారులు.. మరిన్ని ఆధారాలు సేకరించేందుకు ఈ సోదాలు చేపట్టారు. చెన్నైలోని మైలాపూర్, టీనగర్, పేరంగుడి, అరప్పుకొట్టాయ్, హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో అనిల్‌రెడ్డికి సంబంధించిన కంపెనీల కార్యాలయాలు, చెన్నై అళ్వార్‌పేట్, ఇంజంబాక్కంల్లోని అనిల్‌రెడ్డి నివాసాల్లో ఈ తనిఖీలు జరిగాయి.అనిల్‌రెడ్డి జగన్‌కు వరుసకు సోదరుడు మాత్రమే కాదు అత్యంత సన్నిహితుడు కూడా. చెన్నైలో నివసిస్తుంటారు. జగన్ తరఫున వివిధ ఆర్థిక వ్యవహారాలు చక్కబెడుతుంటారనే ప్రచారముంది. గతంలో ఆఫ్రికాలో మద్యం వ్యాపారం నిర్వహించేవారు. వైకాపా హయాంలో జరిగిన ఇసుక కుంభకోణంలోనూ జేసీకేసీ, ప్రతిమ సంస్థలను ముందుపెట్టి అనిల్‌రెడ్డే ఇసుక దందా నిర్వహించారనే ఆరోపణలున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల కోసం వైకాపా తరఫున పెద్ద ఎత్తున సర్వేలు చేయించి, అభ్యర్థులకు నగదు అందించారన్న ఫిర్యాదులున్నాయి. అది మద్యం ముడుపుల సొమ్మేనని సిట్ అనుమానిస్తోంది. వీటన్నింటి గుట్టు రట్టు చేసేందుకు ఈ సోదాలు జరిపింది.
రూ. 4000 కోట్ల లిక్కర్ స్కాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, హైదరాబాద్ జోనల్ ఆఫీస్ భారీగా తనిఖీలు నిర్వహించాయి. మనీలాండరింగ్ చట్టం , 2002 కింద హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తంజావూరు, సూరత్, రాయ్‌పూర్, ఢిల్లీ ఎన్సీఆర్, ఆంధ్రప్రదేశ్‌లోని 20 ప్రదేశాల్లో సెర్చ్ ఆపరేషన్లు చేపట్టింది. ఏపీ సీఐడీ ఇప్పటికే ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2019 అక్టోబర్ నుండి 2024 మార్చి మధ్య అమలు చేసిన కొత్త లిక్కర్ పాలసీ కిందే భారీ మోసాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. పాపులర్ బ్రాండ్లు కిక్‌బ్యాక్‌లు ఇవ్వడానికి నిరాకరించగా, వాటిని పక్కనబెట్టి కొత్త / నకిలీ బ్రాండ్లను ప్రోత్సహించారు. ఆటోమేటెడ్ సిస్టమ్‌ను తొలగించి మాన్యువల్ ఆర్డర్ సిస్టమ్‌కి మారడం ద్వారా సప్లై వాల్యూమ్‌లో భారీ మోసాలు జరిగాయి.
స్వాధీనం చేసిన వస్తువులు
బోగస్ ఇన్వాయిసులు, ట్రాన్స్‌పోర్ట్ చలాన్లు, వేరే ధరలతో ఉన్న పారలల్ ఇన్వాయిసులు దొరికాయి. నిందితుల మధ్య వాట్సాప్ చాట్స్, దుబాయ్‌కు పంపిన డబ్బుల లెడ్జర్లు బయటపడ్డాయి. ఒక ప్రదేశం నుంచి రూ. 38 లక్షల అక్రమ నగదును ED స్వాధీనం చేసుకుంది. ఏపీ లిక్కర్ స్కాంలో డబ్బు మళ్లింపులు, బోగస్ ట్రాన్సాక్షన్లు, కిక్‌బ్యాక్‌లకు సంబంధించిన పక్కా ఆధారాలు దొరకడంతోఈడీ దర్యాప్తు మరింత వేగవంతమైంది.