AP; ఏపీకి రూ.5,265 కోట్ల నష్టం: సీఎం చంద్రబాబు
తుఫానుతో ఏపీకి భారీ నష్టం వాటిల్లిందన్న సీఎం.. వ్యవసాయ రంగానికి రూ.829 కోట్ల నష్టం.. ఆర్అండ్బీకి రూ.2,079 కోట్ల మేర నష్టం.. 120 పశువులు మృత్యువాత పడ్డాయన్న సీఎం
మొంథా తుఫాన్ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. పంట పొలాలు నాశనం అయ్యాయి. రోడ్లు , రైల్వే ట్రాక్లు తెగిపోయాయి. ఈ నేపథ్యంలో బుధవారం తుఫాన్ ప్రభావిత జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేసి తర్వాత.. స్వయంగా పొలాల దగ్గరకు వెళ్లి రైతులతో మాట్లాడారు.తుఫాన్ ప్రభావ పరిస్థితి, పంట, ఆస్తి నష్టం పై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మొంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటు, ఆస్తి నష్టంపై అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టం పై ఇప్పటికే ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు ఆయన తెలిపారు. వరి, మొక్కజొన్న, పత్తి. అరటి, ఇతర ఉద్యాన వన పంటలు బాగా దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేశారు. అయితే ఐదు రోజుల్లోగా పంట నష్టం పూర్తి నివేదిక అందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన ప్రతీ ఒక్కరిని ఆదుకుంటామని చంద్రబాబు హామీనిచ్చారు. బాధితులకు కూటమి ప్ఱభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వరద గుప్పిట్లో ప్రజలు ఉంటే వైసీపీ ఇంకా రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.
భారీ నష్టం
‘మొంథా’ తుపాను వల్ల రాష్ట్రానికి రూ.5,265 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు చంద్రబాబు తెలిపారు. వ్యవసాయ రంగానికి రూ.829 కోట్లు, ఆర్అండ్బీకి రూ.2,079 కోట్ల మేర నష్టం వాటిల్లిందని చెప్పారు. తుపాను వల్ల ఎవరూ ప్రాణాలు కోల్పోలేదన్న ఆయన.. 120 పశువులు మృత్యువాత పడినట్లు పేర్కొన్నారు. నీటిపారుదల శాఖకు సంబంధించి ఈసారి నష్టం తక్కువే ఉందన్నారు. తుపాను నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నష్టం వివరాలను అధికారులు ఆయనకు వివరించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. మొంథా తుపాను బీభత్సాన్ని ముందుగానే అంచనా వేశామని, అందుకే నష్టం తగ్గిందన్నారు. ‘‘ప్రతి కుటుంబాన్ని, ఇంటినీ జియోట్యాగింగ్ చేయగలిగాం. తుపాను వల్ల మారుతున్న పరిణామాలకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకున్నాం. గతంలో విద్యుత్ సరఫరా ఆగితే 10 గంటల వరకు వచ్చేది కాదు. ప్రస్తుతం విద్యుత్ సరఫరా ఆగినా 3 గంటల్లోనే పునరుద్ధరణ జరిగింది. అందరూ నిబద్ధతతో పని చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఓ వైపు వర్షం పడుతున్నా.. చెట్లను తొలగించి ఇబ్బందులు లేకుండా చేశారు. ’’ అని చంద్రబాబు తెలిపారు.
దెబ్బతిన్న పంటలను పరిశీలించిన డిప్యూటీ సీఎం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు మండలం కృష్ణాపురం గ్రామంలో పర్యటించారు. ‘మొంథా’ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి హామీ ఇచ్చారు. తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న గ్రామాల్లో సూపర్ క్లోరినేషన్, సూపర్ శానిటేషన్ కార్యక్రమాలను మొదలుపెట్టాలని ఆదేశించారు. తుపాను ప్రభావం వల్ల పాడైన రోడ్లను ప్రాధాన్య ప్రకారం బాగు చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తీసుకోవాల్సిన చర్యలను తక్షణమే మొదలుపెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు.
బాధితులకు అండగా ఉంటాం
ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి, అన్ని విధాల సహాయం అందిస్తుందని పవన్ హామీ ఇచ్చారు. రైతుల పంట నష్టాలపై అధికారులను సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే మొంథా తుఫాన్ ప్రభావంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వేల ఎకరాల వ్యవసాయ భూమి దెబ్బతిన్నట్లు అంచనా. కేవలం కృష్ణా జిల్లాలోనే 2.5 లక్షల ఎకరాల్లో వరి పంట తీవ్రంగా నష్టపోయింది. అరటి, బొప్పాయి గాలివానతో నేలమట్టమయ్యాయి. తుఫాన్ తాకిడితో చెరువుల్లా మారిన పొలాల దృశ్యాలు హృదయవిదారకంగా మారాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తగిన పరిహారం అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా.. ఇతర మంత్రులు ఈ రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సీఎం చంద్రబాబు ముందు జాగ్రత్తతో తుపాను వల్ల జరిగే నష్టం అధికంగా జరగకుండా చూశామని అన్నారు. భారీ వర్షాల కారణంగా 46 వేల హెక్టార్లలో పంట నష్టం వచ్చిందని, దీంతో 56 వేల మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని, వీరిలో అత్యధికంగా కౌలురైతులే ఉన్నారని, వారందరిని ఆదుకునేందుకు చంద్రబాబుతో రివ్యూ మీటింగ్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.