AP: కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి... తొలుత చంద్రబాబు... తర్వాత పవన్ ప్రమాణం;
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు శుక్రవారం ఉదయం 9.46 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలుత ప్రొటెం స్పీకర్ నియామకంపై అసెంబ్లీ కార్యదర్శి ప్రకటన చేస్తారు. అనంతరం సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి రిజిస్టర్లలో సంతకాలు చేస్తారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తారు. మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ సాధారణ సభ్యుడిగానే ప్రమాణం చేస్తారు. ఇంగ్లిష్ అక్షరాల వరుసక్రమంలో సభ్యులను పిలుస్తారు. అనంతరం శాసనసభ సభాపతి ఎన్నికల ప్రక్రియను ప్రకటిస్తారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో సహా ఎవరికీ విజిటింగ్ పాస్‌లు జారీ చేయడం లేదని అసెంబ్లీ అధికారులు ప్రకటించారు. స్థలాభావం కారణంగా విజిటింగ్ పాస్‌ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలంతా ఉదయం 9 గంటలకల్లా పసుపు చొక్కాలతో రావాలని హైకమాండ్ సూచించింది. ఈ మేరకు ఎమ్మెల్యేలందరికీ సమాచారం అందజేయడం జరిగింది. వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు నివాళులర్పించనున్నారు. అనంతరం అక్కడ్నుంచీ నేరుగా అసెంబ్లీకి వెళ్లనున్నారు.
నిర్మాతలూ కదిలిరండి
ఆంధ్రప్రదేశ్‌లో స్టూడియోలు నిర్మించేందుకు నిర్మాతలు తరలిరావాలని ఏపీ నూతన పర్యాటక శాఖ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ఆహ్వానం పలికారు. సచివాలయంలో మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన దుర్గేష్... రూ.2.31 కోట్లతో 10 టూరిజం బోట్ల కొనుగోలుకి సంబంధించిన ఫైల్‌పై తొలి సంతకం చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కందుల దుర్గేష్‌కు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జనసేన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, టీడీపీ నేతలు అభినందలు తెలిపారు. మంచి వనరులు ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను అధికార యంత్రాంగంతో కలిసి పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని దుర్గేశ్ బాధ్యతల స్వీకరణ అనంతరం ప్రకటించారు. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం వంటి వాటిని విస్తృతంగా ప్రోత్సహిస్తామన్నారు. పర్యాటక ప్రాంతాలుగా విరజిల్లాల్సిన ప్రాంతాలను వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని... అదృష్టవశాత్తు ప్రజానీకం వైసీపీకి సరైన రీతిలో బుద్ధి చెప్పారని తెలిపారు. ఇకపై పర్యాటక సాంస్కృతిక విధానాల్లో సరైన రీతిలో ముందుకు తీసుకువెళ్లి ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు ఉంటాయన్నారు. పర్యాటక రంగాన్ని ఉపయోగించుకొని నిధులు సమకూర్చుకునే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు.