AP CABINET: ముంబై తరహాలో విశాఖ అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలు.. రూ. 1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం.. విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయం ## అమరావతిలో రూ. 212 కోట్లతో రాజ్‌భవన్ నిర్మాణం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడి గూగుల్ డాటా సెంటర్ తో సహా రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపింది. విశాఖపట్నంలో రైడెన్ ఇన్ఫోటెక్ మెగా డేటా సెంటర్, అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులు, ఉద్యోగుల డీఏ పెంపు వంటి కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో మొత్తం 26 ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చారు. సమావేశం తర్వాత మంత్రి పార్థసారథి మీడియాకు వివరాలు వెల్లడించారు. సమావేశంలో అతి పెద్ద నిర్ణయం విశాఖపట్నంలో రైడెన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ చేత ఏర్పాటు చేసే హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌కు ఆమోదం. ఈ ప్రాజెక్టుకు రూ.87,520 కోట్ల పెట్టుబడి పెడతారు. ఇది భారతదేశంలో అతిపెద్ద ఎఫ్‌డీఐలలో ఒకటిగా నిలుస్తుంది. ఈ డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ రంగాల్లో గ్లోబల్ హబ్‌గా మారుతుంది. దీని ద్వారా 67,218 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. "వైజాగ్‌ను 'ఏఐ సిటీ'గా తయారు చేయడమే లక్ష్యం" అని ప్రభుత్వం చెబుతోంది. మరో 26 ప్రాజెక్టులకు మొత్తం రూ.27,304 కోట్ల పెట్టుబడులకు ఆమోదం ఇచ్చారు. ఇవి ఐటీ, మాన్యుఫాక్చరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో ఉంటాయి.
ఏపీని అగ్రస్థానంలో నిలిపే దిశగా..
ఏపీలో రూ. 1.17 లక్షల కోట్ల విలువైన భారీ పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసినట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతాన్ని ఇవ్వడంతో పాటు, వేలాది ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమం చేస్తుందని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయాలు పారిశ్రామిక రంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలబెడతాయని భావిస్తున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో విశాఖపట్నం అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. విశాఖను దేశ ఆర్థిక రాజధాని ముంబై తరహాలో ఒక శక్తివంతమైన ఆర్థిక, సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఇప్పటికే గూగుల్, టీసీఎస్ వంటి ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలు విశాఖకు వస్తున్నాయని, నగరాన్ని ఒక అంతర్జాతీయ ఐటీ హబ్‌గా మార్చడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
అమరావతి నిర్మాణ పనులకు వేగం
రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసే దిశగా కూడా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో రూ. 212 కోట్ల అంచనా వ్యయంతో నూతన రాజ్‌భవన్ నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. దీంతో పాటు, రాజధాని పరిధిలోని మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైన నిధులలో 25% సీఆర్డీఏ (CRDA) ద్వారా కేటాయించాలని నిర్ణయించారు. ఈ చర్యలతో రాజధాని ప్రాంతంలో మౌలిక వసతుల కల్పన మరింత ముందుకు సాగనుంది. వీటితో పాటు పలు సంస్థలకు అవసరమైన భూ కేటాయింపులు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కరువు భత్యం (డీఏ) వంటి అంశాలపై కూడా సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, కేవలం పెట్టుబడులకు ఆమోదం తెలపడమే కాకుండా, ఆయా సంస్థలు క్షేత్రస్థాయిలో తమ కార్యకలాపాలను వేగంగా ప్రారంభించేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత శాఖల మంత్రులపై ఉందని స్పష్టం చేశారు. "రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఎంతో కష్టపడుతున్నాం. ఈ ప్రణాళికల ఫలాలు ప్రజలకు చేరేలా, వాటి ప్రాముఖ్యతను వారికి అర్థమయ్యేలా వివరించాలి," అని ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో మంత్రులు చురుకైన పాత్ర పోషించాలని ఆయన సూచించారు.
వెస్ట్‌లో ముంబై తరహాలో ఈస్ట్‌లో విశాఖ..
ఆర్సెలార్ మిత్తల్ ప్లాంట్‌కు త్వరలో శంకుస్థాపన చేయబోతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. విశాఖను ముంబై లాగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. పంచాయితీ రాజ్‌లో పంచాయతీలు రేషనలైజేషన్ చేసి రూరల్, అర్బన్ పంచాయితీలుగా చేయాలని తెలిపారు. 2028 నాటికి వైజాగ్ దేశంలో ఒక ప్రత్యేక సిటీగా ఉండబోతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీ రంగంలో లక్షలాది ఉద్యోగాలు రాబోతున్నాయని పేర్కొన్నారు. వెస్ట్‌లో ముంబై తరహాలో ఈస్ట్‌లో విశాఖ అభివృద్ధి చెందబోతుందన్నారు. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్‌లో 4 లక్షల 70 వేల మంది ఆంధ్రాలో పని చేస్తున్నారని తెలిపారు. దీనిని 10 లక్షలకు పెంచాలని అధికారులకు చెప్పినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.