EC: ఎన్నికల అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు

పకడ్బంధీ ఏర్పాట్లు చేసినట్లు చెప్పిన ఏపీ సీఈవో మీనా... ఓటర్ల జాబితా అందించాలని ఆదేశం...

Update: 2024-05-12 01:30 GMT

పోలింగ్ ఏర్పాట్లపై ఎన్నికల అధికారులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఎన్నికల సిబ్బంది ఓటర్ల జాబితాలు, EVM లేబులింగ్ లను సిద్దం చేసుకోవాలని సూచించారు. పోటీలో ఉన్న అభ్యర్ధులందరికీ పోలింగ్ స్టేషన్ల జాబితా అందించాలన్న ఆయన పోలింగ్ రోజు సెక్టార్ అధికారులకు అందించిన రిజర్వు EVMలు, మాక్ పోలింగ్ లేబిలింగ్ లను తప్పనిసరిగా చేయాలని సూచనలిచ్చారు. ఈవీఎంల రవాణాకు ఉపయోగించే వాహనాలు జీపీఎస్ ట్రాకింగ్ చేయాల్సిందిగా స్పష్టం చేశారు. సాయుధ పోలీసుల రక్షణలోనే ఆ వాహనాలు వెళ్లేలా చూడాలని తేల్చిచెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో మోహరించిన సాయుధ పోలీసు బలగాలు బయట మాత్రమే ఉండాలన్నారు. పోలింగ్ పార్టీలు, ఓటర్లు వడదెబ్బకు గురికాకుండా ORS ప్యాకెట్లను సరఫరా చేయాలన్నారు. మీడియా కంట్రోల్ రూమ్, కమ్యూనిటీ కంట్రోల్ రూమ్, వెబ్ కాస్టింగ్ కంట్రోల్ రూమ్ లతో కూడిన జిల్లా కంట్రోల్ రూమ్ తప్పకుండా పని చేస్తుండాలన్నారు. EVMలపై ఫిర్యాదులు అందిన 15-20 నిమిషాల్లోపే మరమ్మత్తుకు చర్యలు చేపట్టాలన్నారు. వెబ్ కాస్టింగ్ ప్రసారాన్ని డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్, CEO కంట్రోల్ రూమ్ కు పరిమితం చేయాలని సూచించారు.


మార్చి 16న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏపీలో రూ 269.28 కోట్లు నగదు, మద్యం, ఆభరణాలు సీజ్ చేసినట్లు ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 లోక్ సభ నియోజకవర్గాలకు మే 13న నాలుగో దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం మొత్తం 1,06,145 మంది పోలీసులు ఎన్నికల బందోబస్తులో పాల్గొంటున్నారని తెలిపారు. మొత్తం 46,389 పోలింగ్ స్టేషన్లలో 12,438 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని పేర్కొన్నారు.

ఏపీలో పోలింగ్‌ నిర్వహణకు ఎన్నికల సంఘం ముమ్మర ఏర్పాట్లు చేసింది. 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈనెల 13న పోలింగ్‌ నిర్వహించనుంది. ఈ ఏపీలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 175 నియోజకవర్గాలకుగానూ 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాలైన పాడేరు, అరకు, రంపచోడవరం స్థానాల్లో సాయంత్రం 4గంటల వరకు, కురుపాం, పాలకొండ, సాలూరులో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన వారిని ఓటింగ్ కు అమమతిస్తామని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.

Tags:    

Similar News