ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యవసాయంపై చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి, నకిలీ వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై ఏపీ సీఐడీ తీవ్రంగా స్పందించింది. యూరియా, పురుగుల మందుల వినియోగం తగ్గించాలని సీఎం చెప్పినట్లుగా ఈ వీడియోలను మార్ఫింగ్ చేసి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఐడీ గుర్తించింది. ఈ ఘటనపై ప్రభుత్వం కూడా సీరియస్‌గా ఉంది.
రైతులకు చంద్రబాబు ఇచ్చిన సూచనలకు విరుద్ధంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి వీడియోలను ఎడిట్ చేసి తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని సీఐడీ గుర్తించింది. ఈ విధంగా నకిలీ వీడియోలు సృష్టించి వైరల్ చేస్తున్న వారిపై ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు సైబర్ క్రైమ్ ఐజీ తెలిపారు. ఇటువంటి దుష్ప్రచారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఈ ఫేక్ ప్రచారాన్ని ఖండిస్తూ ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. "ముఖ్యమంత్రి ప్రసంగాన్ని తమకు నచ్చినట్లుగా ఎడిట్ చేసి, రైతులను ఆందోళనకు గురిచేసేలా కొందరు కుట్రదారులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. యూరియా, పురుగుల మందుల వినియోగంపై సీఎం చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు. కాబట్టి, రైతులు, ప్రజలు ఇటువంటి నకిలీ వీడియోలను నమ్మవద్దు, ఇతరులకు షేర్ చేయవద్దు" అని ఆ పోస్ట్‌లో స్పష్టం చేసింది. ముఖ్యమంత్రికి సంబంధించిన ఫేక్ వీడియోలు తయారు చేసి షేర్ చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఏపీ ఫ్యాక్ట్ చెక్ హెచ్చరించింది.