CBN: కేంద్ర సాయం ఇంకా అందలేదు
చంద్రబాబు స్పష్టీకరణ.. ప్రాథమిక నివేదిక నేడు కేంద్రానికి పంపుతామని వెల్లడించారు;
కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు సాయం చేసిందనే వార్తలు అవాస్తవమని సీఎం చంద్రబాబు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల కోసం కేంద్రం తెలంగాణ, ఏపీకి రూ.3,300 కోట్లు విడుదల చేసిందని ప్రచారం జరుగుతోంది. అయితే వరద సాయంపై తమకు ఇంకా ఎలాంటి సమాచారం రాలేదని సీఎం వెల్లడించారు. తాము ఇంకా వరదనష్టంపై నివేదిక పంపించలేదన్నారు. బుడమేరు కట్ట తెగిన ప్రాంతంలో హెలికాప్టర్‌లో సీఎం శుక్రవారం ఉదయం ఏరియల్ విజిట్ చేశారు. బుడమేరు ఏఏ ప్రాంతాలగుండా ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తున్నదీ, అక్కడి గ్రామాల పరిస్థితి ఏమిటనేదీ ఆయన పరిశీలించారు. వరదల్లో చిక్కుకున్న విజయవాడకు ఇక ఆ సమస్య లేకుండా చేస్తామని చంద్రబాబు అన్నారు. వరద ముంపు ఉండని కొత్త విజయవాడను చూపిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ‘హుద్‌హుద్ తుఫాన్‌లో చిన్నాభిన్నమైన విశాఖను తర్వాత ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దాం. అలాగే విజయవాడ రూపురేఖలు మారుస్తాం’’ అన్నారు. శుక్రవారం ఆయన విజయవాడ కలెక్టరేట్‌లో మాట్లాడారు. ‘‘మానవ తప్పిదాలతో విజయవాడ మునిగింది. బుడమేరు ఆక్రమణలకు అడ్డుకట్ట వేసి, గట్లను గత ప్రభుత్వం పటిష్ఠం చేసి ఉంటే ఇవాళ ఈ వరద ఉండదు.
వరదల్లో నష్టపోయిన వారిని నిలబెట్టాలన్నది తన తపనని, దానిపైనే దృష్టి పెట్టి పనిచేస్తున్నానని చంద్రబాబు తెలిపారు. వ్యాపారాలు చేసుకొనేవారు బాగా దెబ్బతిన్నారు. ఇళ్లలో సామాన్లు నాశనం అయ్యాయన్నారు. వాహనాలు దెబ్బతిని నష్టపోయారు. ఇవన్నీ నేను నాకళ్లతో చూశాను. వీరిని ఎలా ఆదుకోవాలన్నది సమస్య. బీమా కంపెనీలు కొర్రీలు వేయకుండా త్వరగా పరిహా రం ఇచ్చేలా చూస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఏవైనా సర్టిఫికెట్లు కావాలంటే ఇస్తామని చెప్పాం. వ్యాపారా లు, వాహనాలు, ఇళ్ల రుణాలు రీ షెడ్యూల్ చేసి వారికి కొంత వ్యవధి దొరికేలా చూడాలని అనుకొంటున్నాం. కొత్త రుణాలు ఇప్పించడంపై బ్యాంకులతో మాట్లాడుతున్నాం. మేం సొంతంగా ఇవ్వడానికి రాష్ట్రం ఇప్పటికే బాగా లోటులో ఉంది. ఈ పరిస్ధితులన్నీ కేంద్రానికి వివరించామని తెలిపారు. శుక్రవారం ఒక్క రోజే పదకొండున్నర లక్షల మంచినీళ్ల బాటిళ్లు, నాలుగున్నర లక్షల పాల ప్యాకెట్లు, ఆరు లక్షల బిస్కట్ ప్యాకెట్లు, డెబ్బై ఐదు వేల కొవ్వొత్తులు, ఏభై వేల అగ్గిపెట్టెలు సరఫరా చేశారు. కాగా, ముంపు ప్రాంతాల్లో ఏడువేల మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పటికి 12 వేల టన్నుల చెత్తను తీశా రు. 110 ఫైర్ ఇంజన్లు రోడ్లు, ఇళ్లు, అపార్ట్‌మెంట్లు శుభ్రం చేస్తున్నాయి. నీళ్లు ఉన్న ప్రాంతాల్లోని 23 వేల కనెక్షన్లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో కరెంటు సరఫరా పునరుద్ధరించారు. 15 డ్రోన్లు ఆహారం పంపిణీ చేస్తున్నాయి. విజయవాడ ముంపు ప్రాంతంలో ఉచిత బస్సులు పెట్టామని తెలిపారు.
మళ్లీ వరద భయం
విజయవాడను మళ్లీ వరద భయం వెంటాడుతోంది. నిన్నరాత్రి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి సింగ్‌నగర్, విద్యాధరపురం, భవానీపురం, రాజరాజేశ్వరిపేట, గ్రామీణంలో అంబాపురం, జక్కంపూడి కాలనీ, రాయనపాడు, నైనవరం గ్రామాల్లో ఒక అడుగు నుంచి రెండు అడుగుల మేర నీరు పెరిగింది. దీంతో అధికారులు, ప్రజలు ఆందోళనకు గురయ్యారు.