CBN: తల్లి, చెల్లిపై దారుణ పోస్టులు పెట్టిస్తున్న జగన్
దీనికి అడ్డుకట్ట వేయకపోతే మరిన్ని దారుణాలు... సోషల్ మీడియాపై చంద్రబాబు కీలక కామెంట్స్;
వైసీపీ అధ్యక్షుడు జగన్ తల్లి, చెల్లిపై ఆ పార్టీ నాయకులే సోషల్ మీడియాలో అత్యంత దారుణంగా, వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్‌లో తీరని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు పెడుతున్నవారిని నియంత్రించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. హిందూస్థాన్ టైమ్స్ నేషనల్ పొలిటికల్ ఎడిటర్ సునేత్రా చౌదరి అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు ఇచ్చారు.
సోషల్ మీడియా చూసే టైం ఉండదు
సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో చూసే సమయం తనకు ఉండదని చంద్రబాబు అన్నారు. కానీ గవర్నెన్స్‌కు అవసరమయ్యే వాటిని ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో వాట్సాప్ గవర్నెన్స్‌ను తీసుకొస్తున్నామన్నారు. దీని ద్వారా అన్ని రకాల సమస్యలను పరిష్కరించేందుకు, పౌరసేవలను చివరి వ్యక్తి వరకు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ రోజుల్లో డేటా అంటే సంపద. క్వాలిటీ డేటాతో అద్భుతాలు సాధించవచ్చు. ఏఐ, డీప్ టెక్నాలజీతో వ్యవసాయం, పశువైద్యం, ఆరోగ్యం వంటి రంగాల్లో నిజమైన, కచ్చితమైన పరిష్కారాలను సాధించవచ్చు. ఏఐ, డీప్ టెక్నాలజీతో ప్రపంచంలో ఏ మూలన ఉన్నా స్మార్ట్‌ఫోన్‌తో ఏ పనులైనా చేసుకోవచ్చని తెలిపారు.
వాజ్‌పేయి హయాంలోనూ..
కేంద్రంలో తాము కీలక పాత్ర పోషించడం ఇదే తొలిసారి కాదని చంద్రబాబు గుర్తు చేశారు. వాజపేయి ప్రభుత్వానికి ఎలాంటి షరతులూ లేకుండా, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆరున్నరేళ్లు మద్దతు ఇచ్చామన్నారు. గతంలో పార్లమెంట్‌లో ప్రతిపక్ష పాత్ర పోషించామన్నారు. "ఆ సమయలో బీజేపీకి రెండు సీట్లే వస్తే టీడీపీకి 35 సీట్లు వచ్చాయి. వాజపేయి బీజేపీని నిర్మిస్తే మోదీ పటిష్ఠం చేసి సుస్థిరం చేశారు. ఒకప్పుడు 2 సీట్లు ఉన్న బీజేపీ ఇప్పుడు పదకొండేళ్లుగా పరిపాలిస్తోంది. భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం కొనసాగుతుంది.” అని చంద్రబాబు అన్నారు. మహోన్నత దేశం కోసం తాము బీజేపీతో కలిసి పనిచేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి అన్నారు. మోదీ బలమైన నాయకుడని... ఆయనది ఆధునిక ప్రగతి శీల దృక్పథమన్నారు. సంస్కరణలు, ఇంటర్నెట్ విప్లవం, టెక్నాలజీలను ఉపయోగించి తర్వాతి స్థాయి విప్లవాన్ని నరేంద్రమోదీ సృష్టించారు. ప్రపంచంలో 7.5-8 శాతం జీడీపీ వృద్ధి రేటు ఉన్న దేశం భారత్ మాత్రమే అన్నారు.