AP: పదవులు కాదు ఏపీ ప్రయోజనాలే ముఖ్యం
అమిత్ షాకు స్పష్టం చేసిన చంద్రబాబు... టీడీపీ ఎంపీలకు కీలక ఆదేశాలు;
నేటి నుంచే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సభలో లేవనెత్తాల్సిన అంశాలను, అనుసరించాల్సిన వైఖరిపై ఎంపీలతో చంద్రబాబు చర్చించి కీలక సూచనలు జారీ చేశారు. లోక్ సభ స్పీకర్ ఎంపికపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ ఎంపికపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేశారని చంద్రబాబు తెలిపారు. అయితే లోక్‌సభ సభాపతి విషయం లో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అమిత్ షాకు స్పష్టంగా చెప్పానని చంద్రబాబు తెలిపారు. కూటమిలో కీలక పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీకి పదవులతో సంబంధంలేదని, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే తమకు ముఖ్యమని తేల్చిచెప్పినట్లు షాకు వివరించినట్లు చంద్రబాబు తెలిపారు. పార్లమెంటరీ పార్టీ భేటీలో టీడీపీ ఎంపీలతో చంద్రబాబు మాట్లాడారు. పదవుల కోసం పట్టుబడితే ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటాయని, ఈ విషయం ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. పదవులు తమకు ముఖ్యంకాదన్నారు. ఈసారి పార్లమెంట్ లో టీడీపీకి 16 ఎంపీల బలం ఉండడంతో ఏపీకి ఎక్కువ నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని చంద్రబాబు లోక్‌సభ సభ్యులకు మార్గనిర్దేశం చేశారు.
ఒక్కో ఎంపీకి మూడు శాఖలు కేటాయిస్తానని, ఆ శాఖకు సంబంధించి రాష్ట్ర మంత్రితో సమన్వయం చేసుకుంటూ కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకురావాలని ఎంపీలకు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రతీ ఎంపీ ప్రథమ ప్రాధాన్యం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన భేటీలో పోలవరం, అమరావతిల నిర్మాణం పూర్తిచేసే విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలును, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా బైరెడ్డి శబరి, కోశాధికారిగా దగ్గుమళ్ల ప్రసాద్ లను చంద్రబాబు ఎంపిక చేశారు.
నేడు కేబినేట్ భేటీ...
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినేట్ భేటీ జరగనుంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న ఇదే తొలి మంత్రివర్గ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలిపేలా వైట్ పేపర్ విడుదలకు సంబంధించి ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డీఎస్సీ, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, పింఛను మొత్తం రూ.4 వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై చంద్రబాబు అయిదు సంతకాలు చేశారు. ఇవాళ్టీ మంత్రివర్గ సమావేశంలో వీటికి ఆమోదం తీసుకునే అవకాశం ఉంది. సూపర్ 6 పథకాల అమలు, అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పనపైనా మంత్రివర్గంలో చర్చిస్తారని తెలుస్తోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టాక పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధానిలో చంద్రబాబు పర్యటించారు. మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుల పరిస్థితి, పూర్తి చేసేందుకు నిధుల సమీకరణపైనా చర్చించనున్నట్లు తెలిసింది. జులై నెలాఖరులోగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉంది. కొత్త బడ్జెట్ తయారీలో ప్రాధాన్య అంశాలపైనా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఎసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లపైనా వివరాలు తెప్పిస్తున్నారు. వాటిని కూడా మంత్రివర్గం ముందుంచి ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.