సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గింపుపై చర్చ జరిగింది. టొబాకో బోర్డు ద్వారా ఏపీలో పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రూ.150 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. పొగాకు ధరలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే రూ.300 కోట్లతో 20 మిలియన్ కేజీలు కొనుగోలు చేస్తున్నట్టు వెల్లడించింది. బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఏడు చోట్ల పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు వివరించారు. పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే రూ. 300 కోట్లలో టొబాకో బోర్డు రూ.150 కోట్లు భరించేలా చూడాలన్న ముఖ్యమంత్రి విన్నవించారు. పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్ వంటి అంశాలను టొబాకో బోర్డు ద్వారా నియంత్రించేలా చట్టసవరణ చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కోరారు.
ఆయిల్ ఫాం దిగుమతి సుంకాన్ని 10 శాతానికి తగ్గించడంపై పునరాలోచన చేయాలని పీయూష్ గోయల్ ను సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. దిగుమతి సుంకం తగ్గించడం వల్ల రాష్ట్రంలోని పామాయిల్ రైతులకు సరైన ధర రావడం లేదని.. తీవ్రంగా నష్టపోతారని కేంద్ర మంత్రికి వివరించారు.