Chandrababu Naidu : నిర్మలా సీతారామన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. వాటిపై చర్చ
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య ఆర్థిక అంశాలపై, ప్రధానంగా రాబోయే పెట్టుబడుల సదస్సుపై వారి మధ్య చర్చ జరిగింది. నవంబరు 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు సంబంధించిన అంశాలపై వీరిద్దరూ ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. ఈ సదస్సుకు నిర్మలా సీతారామన్ హాజరవుతారని ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ ధృవీకరించింది.
ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలు, తదితర అంశాల గురించి ముఖ్యమంత్రి కేంద్రమంత్రికి వివరించినట్టు తెలుస్తోంది. వీటితో పాటు రాష్ట్రంలో అమలు జరుగుతున్న అంత్యోదయ పథకం అమలు తీరు, పురోగతిపై కూడా సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థికమంత్రితో చర్చించినట్టు సమాచారం. ఈ భేటీ రాష్ట్ర ఆర్థిక బలోపేతం, పెట్టుబడుల ఆకర్షణకు కేంద్రం నుంచి మద్దతు పొందడం వంటి లక్ష్యాలను కలిగి ఉంది.