CBN: ఏపీ ప్రతిష్టను జగన్ దెబ్బతీశారు
అదానీ-జగన్ లంచం కేసుపై స్పందించిన చంద్రబాబు.. న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడి;
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్.. ఆదానీ గ్రూపు నుంచి లంచం తీసుకున్నారనే ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభ వేదికగా స్పందించారు. లంచం మసకతోవైఎస్ జగన్ రాష్ట్ర ప్రతిష్ఠను మంటగలిపారని చంద్రబాబు మండిపడ్డారు. ఎవరు తప్పుచేసినా వదిలే ప్రసక్తి లేదన్నారు. వదిలేస్తే మరొకరు తప్పు చేసే పరిస్థితి వస్తుందని తెలిపారు. ఇలాంటివార్తలు చూసినప్పుడు చాలా బాధేస్తోందని చంద్రబాబు అన్నారు. సౌర విద్యుత్ టెండర్ల వ్యవహారంలో జగన్ ప్రభుత్వానికి రూ.1,750 కోట్ల మేర ముడుపులు అందాయని అమెరికా కోర్టులో అక్కడి ప్రభుత్వ సంస్థలు చార్జిషీటు దాఖలు చేసిన నేపథ్యంలో జగన్‌ను ఇక్కడ ప్రాసిక్యూట్ చేస్తారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... ‘‘అన్ని కోణాల నుంచీ పరిశీలిస్తున్నాం. ఏం చేయగలమన్నదానిపై న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నామని చంద్రబాబు అన్నారు. ఇక్కడ మన పరిధి ఎంతవరకూ ఉంది.. చట్టపరంగా ఏం చేయగలమో.. నిపుణుల అభిప్రాయం తెలుసుకున్నాక నిర్ణయానికి వస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. అదే సమయంలో తప్పు చేసింది ఎవరైనా వదిలేది లేదని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో సెకీతో కుదుర్చుకున్న ఒప్పందాలు రాష్ట్రానికి భారంగా మారే ప్రమాదముందని వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటిని రద్దు చేస్తారా అన్న ప్రశ్నకు.. ఆయన ఆచితూచి స్పందించారు. ‘పెట్టుబడులు పెట్టేవారి విశ్వాసం దెబ్బ తినకుండా.. అదే సమయంలో ప్రజల కోణంలో కూడా ఆలోచించి నిర్ణయానికి వస్తాం. అన్ని వైపుల నుంచీ ఆలోచిస్తాం’ అని తెలిపారు.
ఏపీ ప్రతిష్ఠను వైసీపీ దెబ్బతీసింది
చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయనన్ని తప్పులు వైసీపీ అధినేత జగన్ చేశారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత వైసీపీ పాలనలో అన్నీ విధ్వంసమయ్యాయని.. అధికార యంత్రాంగం నిర్వీర్యమైందని విమర్శించారు. ఏపీ ప్రతిష్ఠ, బ్రాండ్‌ను దెబ్బతీసేలా వైసీపీ నేతలు ప్రవర్తించారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్య పెట్టారని వ్యాఖ్యానించారు.
వచ్చేసారినేనే...
ఏపీలో చంద్రబాబు 4.0 వర్షన్ ఇప్పుడే మొదలైందని.. ఐదోసారి కూడా తానే సీఎంగా వస్తానంటూ చంద్రబాబు ధీమా వ్యక్తంచేశారు. ఈ క్రమంలో నెక్స్ట్ సీఎం కూడా తానేనని చెప్పకనే చెప్పారు చంద్రబాబు.మంచి చేసే వారిని ప్రజలు మళ్లీ మళ్లీ గెలిపిస్తారని, కొన్ని రాష్ట్రాలలో ఒకే పార్టీ 30 ఏళ్లు పాలించిన విషయాన్ని ఉదహరించారు చంద్రబాబు.వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని.. టీమ్ లీడర్‌గా తాను పనిచేస్తానని, సభ్యులంతా ఇందుకోసం కృషి చేయాలంటూ సూచించారు.