CBN: పంట నష్టం అంచనాలో అలసత్వం ఎందుకు..?

వేగం పెంచాలని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం... కేంద్ర బృందానికి రైతుల మొర;

Update: 2024-09-13 02:00 GMT

ఆంధ్రప్రదేశ్‌లో వరద నష్టం అంచనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు.. మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్యుమరేషన్ ఎంత మేర జరిగిందన్న అంశంపై ఆరా తీశారు. ఎన్యుమరేషన్‌ వివరాలను అధికారులు సీఎం ఇవ్వలేకపోయారు. బాధితులు ఇబ్బందుల్లో ఉంటే వరద నష్టంపై వివరాల సేకరణలో ఇంత జాప్యం ఎందుకుని చంద్రబాబు అధికారులను నిలదీశారు. పంట నష్టం అంచనాకే ఇంత ఆలస్యమైతే పరిహారం ఎప్పటికి ఇవ్వగలమని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్యుమరేషన్ పూర్తి అయితేనే వరద నష్టం వివరాలు కేంద్రానికి ఇవ్వగలమని పేర్కొన్నారు. కేంద్రం సాయం త్వరగా అందాలంటే నష్టం అంచనాలు త్వరితగతిన సమర్పించాలని ఆదేశించారు. నేటిలోగా ఎన్యుమరేషన్ పూర్తి చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు.


కేంద్ర బృందానికి మొర

తమ కష్టం వరద పాలైందని కృష్ణాజిల్లా వరద బాధితులు కేంద్రబృందానికి మొరపెట్టుకున్నారు. వరదలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు కేంద్రబృందం బుధవారం కృష్ణాజిల్లాలో పర్యటించింది. పెనమలూరు మండలంలోని యనమలకుదురు, చోడవరం, పెదపులిపాక గ్రామాలతో పాటు కంకిపాడు మండలం మద్దూరులో దెబ్బతిన్న పంటలను, ఇళ్లను పరిశీలించారు. సాగు మొదలుపెట్టిన రెండు నెలలకే పంటలన్నీ కొట్టుకుపోయాయని పెనమలూరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు యనమలకుదురు, పెదపులిపాకలలో ఇళ్లు మునిగిపోయిన బాధితులతో బృందసభ్యులు మాట్లాడారు. కంకిపాడు మండలం మద్దూరులోని ముంపుప్రాంతాన్ని కేంద్రబృందం సభ్యులు సందర్శించారు.

గుంటూరు జిల్లా తాడేపల్లిలో వరద నష్టంపై ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. కృష్ణానదికి కనీవినీ ఎరుగని వరద వచ్చి రూ.1085.46 కోట్ల నష్టం సంభవించినట్లు కేంద్ర బృందానికి బాపట్ల జిల్లా కలెక్టర్‌ వెంకటమురళి వివరించారు. బాపట్ల జిల్లా వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో కేంద్ర బృందం పర్యటించింది. ప్రాథమిక అంచనాల ప్రకారం వరదలతో ఏపీలో వివిధ రంగాలకు రూ.6,880 కోట్ల నష్టం వాటిల్లిందని, ఇది మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర బృందానికి అధికారులు నివేదించారు. 7 జిల్లాల్లో ప్రభావం అధికంగా ఉందని తెలిపారు. 10.63 లక్షల మంది ప్రభావితం అయ్యారని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోదియా కోరారు. వరద నష్టం పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం.. ప్రభావిత ప్రాంతాలకు వెళ్లేముందు బుధవారం కుంచనపల్లిలోని అధికారులతో సమావేశమైంది. నష్టం వివరాలతో కూడిన ప్రాథమిక నివేదికను సిసోదియా వారికి అందజేశారు.

Tags:    

Similar News