CBN: భూమి కబ్జా చేస్తే తాటా తీస్తాం: చంద్రబాబు
మీ తాత, తండ్రుల కష్టార్జితం మీకే దక్కాలి... రెవెన్యూ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు;
ఆంధ్రప్రదేశ్‌లో సెంటు భూమి కబ్జా చేసినా తాట తీస్తామని... జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. కృష్ణా జిల్లా ఈడ్పుగల్లులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇతరుల భూములు కబ్జా చేయకుండా కొత్త చట్టం తెచ్చామని, భూ కబ్జాలు, మోసాలు, బెదిరింపులు చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ధాన్యం సేకరణ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తానని వెల్లడించారు. "గోనె సంచులు ఎక్కడ నుంచి వెళ్లాయో అనే దానిపై కచ్చితంగా ఉంటాం. బియ్యం అక్రమ రవాణాను అరికడతాం. బియ్యం స్మగ్లింగ్, రీసైక్లింగ్ విషయంలో కఠినంగా ఉంటాం" అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
మీ వారసత్వ కష్టార్జితం మీకే దక్కాలి
మీ తాత, తండ్రుల కష్టార్జితం మీకే దక్కాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కబ్జా చేయాలనుకున్న భూమి కనిపిస్తే చాలు.. జైలు గుర్తుకు రావాలన్నారు. తప్పుడు సర్వేలు జరిగాయని లక్షల మంది ఫిర్యాదు చేశారని... సర్వే వల్ల సెంటు, రెండు సెంట్ల భూమి పోయిందని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. భూమి గురించి వచ్చే ప్రతి ఫిర్యాదునూ పరిష్కరిస్తామని చంద్రబాబు వెల్లడించారు. భూమి కొలతల్లో తేడాలు, సర్వే నెంబర్లలో తేడాలు పరిష్కరిస్తాం. వారసుల పేర్లు సరిగా ఉండేలా చూస్తామని తెలిపారు. అన్నీ సరిచేసి మీకు పట్టాదారు పాస్‌బుక్ ఇస్తామని.. పట్టాదారు పాస్‌బుక్‌లో క్యూఆర్ కోడ్ ఇస్తామని వెల్లడించారు. అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్న ముఖ్యమంత్రి... ఇప్పటి వరకు 95,200 పిటిషన్లు వచ్చాయన్నారు. జనవరి 9 వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. సదస్సుల్లో ఇప్పటి వరకు 3లక్షల మంది పాల్గొన్నారు’’ అని సీఎం తెలిపారు.
సైలోస్ సిస్టంతో అధిక లాభం
త్వరలో సైలోస్ సిస్టమ్ కూడా రైతులకు అందుబాటులోకి తీసుకుని రావాలని చూస్తున్నాము. సైలోస్ సిస్టమ్ అందుబాటులోకి వస్తే రైతులు కావాల్సిన సమయంలో పంటను అమ్ముకునే అవకాశం ఉంటుంది. దీంతో నిల్వ పెట్టిన ధాన్యానికి ఎక్కువ రేటు వస్తుంది. ఎంటీయూ 1262 గత ఏడాది కృష్ణా జిల్లాలో 3,582 మెట్రిక్ టన్నులు దిగుబడి ఇస్తే.. ఈ ఏడాది 32,859 మెట్రిక్ టన్నులు దిగుబడిని ఇచ్చింది. ఇతర జిల్లాల్లోనూ ఈ పంట దిగుబడి ఎక్కువగా ఉంది... అని చంద్రబాబు వివరించారు.