CBN: పేదలకు అండగా ధనికులు

ఉగాది నుంచి పీ 4 విధానం అమలు... కీలక ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు;

Update: 2025-02-28 03:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఉగాది పర్వదినం నుంచి పీ- 4 విధానాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అట్టడుగున ఉన్న పేదల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పీ4 కార్యక్రమానికి ఉగాది నుంచి శ్రీకారం చుడుతామని ముఖ్యమంత్రి తెలిపారు. పేదలను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు పీ4 విధానాన్ని కూటమి ప్రభుత్వం ప్రవేశ పెడుతోంది. ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం వివిధ వర్గాలకు అందిస్తున్న పథకాలకు అదనంగా ఈ కార్యక్రమం ద్వారా అట్టడుగున ఉన్న వారికి మరింత చేయూతను ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. దీనికి సంబంధించి ‘పీ4, ఫ్యామిలీ ఎంపవర్‌మెంట్ - బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌’పైన ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 4 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్.. పీ-4ను అమలు చేయనున్నారు.

పేదల కోసమే పీ4

పేదల అభివృద్ధి కోసం పీ 4 కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించామని చంద్రబాబు తెలిపారు. వచ్చే ఆగస్టుకి 5 లక్షల కుటుంబాలకు ధృవీకరణ చేస్తామన్నారు. సమాజంలో పేదలకు ప్రభుత్వం అండగా ఉండటమే పీ- 4 ముఖ్య ఉద్దేశమని చంద్రబాబు వెల్లడించారు. సంపదలో పైవరుసలో ఉన్న కుటుంబాలు సమజంలో అట్టడుగున ఉన్న కుటుంబాలకు, మద్దతుగా నిలబడటమే పీ4 విధానం యొక్క ముఖ్య ఉద్దేశం కావాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఇందుకు నిర్మాణాత్మక, స్థిరమైన విధానం ఉండాల్సిన ఆవశ్యకతను ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అర్హత ఉన్న కుటుంబాలను డేటా బేస్, హౌస్ హోల్డ్, గ్రామసభ ద్వారా గుర్తించాలని సూచించారు.

పీ 4 నుంచి వీరికి మినహాయింపు

గ్రామీణ ప్రాంతాల్లో 2 ఎకరాల మాగాణి, 5 ఎకరాల మెట్ట భూములు ఉన్న వారికి P4 నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం చంద్రబాబు.. అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను కట్టే వారు.. కారు ఉన్న వారు, 200 యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్న వాళ్ళు పీ-4 నుంచి మినహాయించాలని చంద్రబాబు తెలిపారు. మున్సిపల్ ఏరియాలో సొంత ఆస్తి ఉన్న వారు, ఆర్థికంగా ఉన్న కుటుంబాలకు పీ4 నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. 16 జిల్లాల్లో 76 లక్షల కుటుంబాలపై సర్వే చేస్తున్నామని... ఇప్పటికే అందుతున్న పథకాలకు అదనంగా పీ-4 ద్వారా పేదలకు అదనంగా సాయం అందుతుందని చంద్రబాబు వెల్లడించారు.

Tags:    

Similar News