CBN: ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ముప్పు.. అప్రమత్తంగా ఉండాలన్న సీఎం

ఉత్తరాంధ్రలో భారీ వర్షాల వేళ చంద్రబాబు విజ్ఞప్తి... అధికారులను అలర్ట్‌ చేసిన సీఎం;

Update: 2024-09-09 02:30 GMT

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఉత్తరాంధ్రకు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశముందని.. అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయని.. ఈసారి ఉత్తరాంధ్రపై ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కనపడుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. ముందుగానే ఆయా జిల్లాల అధికారుల్ని సీఎం చంద్రబాబు అప్రమత్తం చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అలర్ట్ గా ఉండాలని చెప్పారు. విజయవాడలో వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు. సహాయక చర్యలను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం విజయవాడ కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడారు. విశాఖలో కొండ చరియలు విరిగి పడుతుండటంతో అక్కడ కూడా అధికారుల్ని అప్రమత్తం చేశామని, కొండ వాలు ప్రాంతంలోని ఇళ్లను ఖాళీ చేయించామని చెప్పారు.

కొల్లేరు పరిసర ప్రాంతాల్లో కూడా ప్రజల్ని అప్రమత్తం చేశామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. భారీ వర్షాలకు నష్టం వాటిల్లకుండా అన్ని జిల్లాల్లో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. శ్రీకాకుళం నుంచి గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల వరకు ఈసారి భారీ వర్షాలు కురిసే అవకాశముందని, ముఖ్యంగా అల్లూరి జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేందుకు ఛాన్స్ లు ఉన్నాయని అన్నారు. గవర్నర్ ని కలిసి, వరద సహాయక చర్యల గురించి వివరించామని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న సహాయక కార్యక్రమాల పట్ల గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేసినట్టు చెప్పారు.

విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో 97 లక్షల మందికి భోజనం అందించామని చెప్పారు చంద్రబాబు. 94 లక్షల వాటర్ బాటిల్స్ ని వారికి చేర్చామన్నారు. 28 లక్షల లీటర్ల పాలు, 41 లక్షల ప్యాకెట్ల బిస్కెట్లు బాధితులకు ఇచ్చి వారి ఆకలి తీర్చామన్నారు. 1.10 లక్షల కుటుంబాలకు నిత్యావసరాలు అందజేశామన్నారు. 3 లక్షల క్యాండిల్స్, 1.9 లక్షల అగ్గిపెట్టెలు సరఫరా చేశామన్నారు. మొత్తంగా 163 మెట్రిక్ టన్నుల కూరగాయలను వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అందించామని, 2090 సార్లు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సప్లై చేశామన్నారు. ఇక బురదతో ఇబ్బందిపడుతున్నవారికి కూడా ప్రభుత్వం సాంత్వన చేకూర్చిందన్నారు సీఎం. ఫైర్ ఇంజిన్ల ద్వారా 27 వేల ఇళ్లు శుభ్రం చేయించామన్నారు. వరదలు మొదలై ఎనిమిది రోజులు గడుస్తున్నా కూడా కొన్ని ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయన్నారు సీఎం చంద్రబాబు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 0.51 టీఎంసీ నీళ్లు ఉన్నాయని, వాటన్నిటినీ బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.

Tags:    

Similar News