Andhra Pradesh : జగన్‌ ప్రభుత్వానికి ముచ్చెమటలు.. కదం తొక్కిన ఏపీ ఉద్యోగులు..!

Andhra Pradesh : జగన్‌ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించారు ప్రభుత్వ ఉద్యోగులు. సర్కార్‌ దిమ్మతిరిగేలా చలో విజయవాడలో సత్తా చాటారు.

Update: 2022-02-03 08:08 GMT

Andhra Pradesh : జగన్‌ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించారు ప్రభుత్వ ఉద్యోగులు. సర్కార్‌ దిమ్మతిరిగేలా చలో విజయవాడలో సత్తా చాటారు. రోడ్ల మీదకు ఎవరొస్తారో, ఎలా వస్తారో చూద్దాం అనుకున్న ప్రభుత్వ పెద్దల కాళ్ల కింద భూమి కంపించేలా కదం తొక్కారు. అసలు ఈస్థాయిలో ఉద్యోగులు తరలివస్తారని ప్రభుత్వవర్గాలు కూడా ఊహించలేదు. చలో విజయవాడ కార్యక్రమం కచ్చితంగా ప్రభుత్వానికి ఓ హెచ్చరికే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఉద్యోగులే కాదు ప్రజల్లోనూ నెలకొన్న ఆగ్రహావేశాలకు ఇదొక నిదర్శనంగా చెబుతున్నారు.

పాలించే వాళ్లు ధర్మం ప్రకారం నడుచుకోకపోతే, ప్రజల అభీష్టం మేరకు నిర్ణయాలు తీసుకోకపోతే ఏం జరుగుతుందో చెప్పడానికి ఇదొక ట్రైలర్ మాత్రమేనని అంటున్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఏం చేసినా చెల్లుతుంది, ఏం చెప్పినా నడుస్తుందని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ పోతే.. పరిణామాలు ఇంతే తీవ్రంగా ఉంటాయని చలో విజయవాడ సభ ప్రస్ఫుటంగా నిరూపించి చూపించిందని చెబుతున్నారు. 13 లక్షల మంది ఉద్యోగులు తమకు అన్యాయం జరిగింది మొర్రో అని ఓవైపు మొత్తుకుంటుంటే.. ప్రభుత్వ పెద్దలుగా చెప్పుకుంటున్న ఓ నలుగురు మాత్రం న్యాయం చేసేశామని చెప్పడం సహజంగానే ఆగ్రహం తెప్పించింది.

ఇన్నాళ్లు తిమ్మినిబమ్మిని చేసి, సామాన్య ప్రజలను మభ్యపెడుతూ వచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలోనూ అలాగే చేసేయొచ్చని కొందరు ప్రభుత్వ పెద్దలు భ్రమలో ఉండి ప్రవర్తించారు. కాని, ఉద్యోగులకు లెక్కలు తెలుసు. ఎవరి లెక్కలు ఎలా తేల్చాలో కూడా బాగా తెలుసు. అందులోనూ ఈ పోరాటంలో ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. పెంకి పిల్లలను ఎలా లొంగదీయాలో వెన్నతో పెట్టిన విద్య. ఒకటికి పది సార్లు ప్రభుత్వం చెప్పింది విన్నారు. ఇక వినేది లేదు పోరాటమే అంటూ కదనరంగంలోకి దిగారు. ప్రభుత్వం నిర్బంధాలు పెట్టినా కనీసంలో కనీసం లక్ష మంది ఉద్యోగులు బీఆర్టీఎస్‌ రోడ్డుకు చేరుకున్నారంటే అర్థం ఏంటి? సెలవులు రద్దు చేసినా, బలప్రదర్శనే అంటూ ప్రభుత్వం బెదిరించే ప్రయత్నం చేసినా.. ఏ ఒక్కరూ వెనకడుగు వేయలేదంటే ఏమని అర్ధం చేసుకోవాలి? ఇది కచ్చితంగా ప్రభుత్వంపై రెండున్నరేళ్లుగా అణచుకొని ఉన్న వ్యతిరేకతేనని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు.

ఆ సంఘం, ఈ సంఘం అని లేదు.. ఉద్యోగులూ, ఉపాధ్యాయులూ ఆగలేదు.. చివరకు పోలీసులు కూడా తమవంతు పాత్ర పోషించారు. ముందుగా జీతాలు పడింది, వారి జీతాల్లో కోత పడింది పోలీసులకే. అందుకే, పోలీసులు సైతం చాలా చోట్ల ఉదాసీనంగా కనిపించారు. మా తరపున కూడా మీరే ఉద్యమం చేయండని సహాయ సహకారాలు అందించారు. ఒకరిద్దరిని అదుపులోకి తీసుకుని పది మందిని వదిలేశారు. దాని ఫలితమే.. చలో విజయవాడకు లక్ష మంది ఉద్యోగులు రాక అని చెబుతున్నారు పొలిటికల్ అనలిస్టులు.

Tags:    

Similar News