AP: ఏపీలో పుట్టిన ప్రతీ బిడ్డా అదృష్టవంతుడే
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు.. భాగస్వామ్య సదస్సులో భారీ పెట్టుబడులు.. దేశానికి గేట్‌వేలా విశాఖ మారుతోందన్నసీఎం
దేశానికి గ్రోత్ ఇంజన్‌గా ఏపీ, ఏపీకి గ్రోత్ కారిడార్‌గా విశాఖ తయారవుతున్నాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతి నిర్మాణం, విశాఖ అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేగంగా చేస్తున్నారన్నారు. ఏపీకి వచ్చే పెట్టుబడులకు అనుమతులు, భూములు కేటాయించి త్వరితగతిన ఉత్పత్తి దశకు చేరుకునేలా చేయూత ఇస్తున్నామన్నారు. ఏపీలో, కేంద్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్లు ఉన్నాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడిదారులను ఆకర్షించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుంటారన్నారు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్. ఏపీలో ప్రశాంతమైన వాతావరణం ఉందని.. వ్యాపార అనుకూల రాష్ట్రంగా నిలిచిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. మళ్లీ రాష్ట్రం తిరిగి గాడిలో పడుతుందన్నారు. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారని.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తోనే పెట్టుబడులు వస్తాయన్నారు. చంద్రబాబు మూడు దశాబ్దాలుగా తనకు స్నేహితుడని.. ఆయన సారథ్యంలో ఏపీకి అనేక పెట్టుబడులు వచ్చాయన్నారు. లక్ష్యం పెట్టుకోవడం సులభం.. అక్కడికి చేరుకోవడం కష్టమన్నారు. ఈ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు 72 దేశాల ప్రతినిధులు వచ్చారన్నారు. ఆంధ్రప్రదేశ్ దేశానికి గేట్‌వేలా మారుతోందన్నారు.
రూ.లక్షా10వేల కోట్ల పెట్టుబడి
ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పెట్టుబడి వచ్చిందని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ రూ.లక్షా పది వేల కోట్ల పెట్టుబడి పెడుతోందని తెలిపారు. పునరుత్పాదక విద్యుత్, బ్యాటరీ, పంప్డ్ స్టోరేజ్ రంగాల్లో బ్రూక్‌ఫీల్డ్ పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పారు. రియల్ఎస్టేట్, బీసీసీలు, ఇన్ఫ్రా, పోర్టుల్లోనూ పెట్టుబడులు వస్తున్నట్లు ట్వీట్ చేశారు.
కుప్పానికి మరో పరిశ్రమ
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లెలో రూ.898.88 కోట్ల పెట్టుబడి వచ్చింది. ఈ మేరకు హ్వాసంగ్ కంపెనీ గ్రీన్‌ఫీల్డ్ నాన్‌లెదర్ ఫుట్‌వేర్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం 100 ఎకరాలు కేటాయించింది. రెంట్ ఫ్రీ లీజు పద్ధతిలో 50 ఏళ్లపాటు ఇచ్చి, సెజ్ హోదా కల్పించనుంది. ఈ కంపెనీ ఏర్పాటుతో 17,645 మందికి ఉపాధి లభించనుంది.
ఫోర్జ్ రూ.2వేల కోట్ల పెట్టుబడి
శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో భారత్ ఫోర్జ్ రక్షణరంగ ఉత్పత్తుల తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తోంది. వీరు దశలవారీగా రూ.2,000 కోట్ల పెట్టుబడులు పెడతారు. ఇది ఆరంభం మాత్రమేనని.. భవిష్యత్తులో ఏపీతో అనుబంధం కొనసాగుతుందని, వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడతామన్నారు భారత్ ఫోర్జ్ వైస్‌ఛైర్మన్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, సీఐఐ ఐరోపా కౌన్సిల్ ఛైర్మన్ అమిత్ కల్యాణి. వచ్చే నాలుగైదేళ్లలో వివిధ రకాల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో రూ.82వేల కోట్ల పెట్టుబడులు పెడతామని రెన్యూ ఎనర్జీ వ్యవస్థాపక ఛైర్మన్, సీఈఓ సుమంత్ సిన్హా తెలిపారు.