AP: పులివెందులలో జగన్‌కు షాక్
జగన్ ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసం... బిల్లులపై నిలదీసిన కాంట్రాక్టర్లు;
ఎమ్మెల్యే హోదాలో తొలిసారి పులివెందులకు వచ్చిన వైసీపీ అధినేత జగన్‌కు సొంత పార్టీ నేతలు ఝలక్ ఇచ్చారు. బిల్లుల కోసం జగన్‌ను నిలదీసినంత పనిచేశారు. బిల్లులు కాకపోతే మా ఆస్తులు అమ్మినా కూడా చేసిన అప్పులు తీరవని... తాము ఎలా బతకాలని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు నుంచి కూడా బిల్లుల కోసం అధికారులపై ఎంత ఒత్తిడి తెచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ సహనంతో ఉండాలని, మళ్లీ మంచి రోజులు వస్తాయని జగన్ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో జగన్ ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. మూడు రోజుల పర్యటనకు జగన్ ఆయన సొంత జిల్లాకు వచ్చారు. పులివెందులకు వెళ్లేసరికి అక్కడ జనం పెద్దగా లేరు. తర్వాత వైసీపీ నాయకులు భారీ స్థాయిలో జనసమీకరణ చేసినట్లు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వంలో కాంట్రాక్టు పనులు చేసి, బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఆవేదనలో ఉన్నవారంతా అక్కడకు వచ్చారు.
నాయకులు, కార్యకర్తలు ఆయనను కలిసేందుకు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. దీంతో పోలీసు సిబ్బంది వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. జగన్ కార్యాలయంలోకి వెళ్లిపోవడంతో ఆయనను కలిసేందుకు అందరూ అక్కడికి చేరుకున్నారు. వారు లోపలకు వెళ్లకుండా సిబ్బంది తలుపులు వేశారు. అందరూ ఒక్కసారిగా కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. కొందరు కిటీ అద్దాలను గట్టిగా కొట్టడంతో అద్దాలు పగిలినట్లు తెలిసింది. తేరుకున్న సిబ్బంది అందరినీ నిలువరింపజేశారు. జగన్‌ను కలిసేందుకు ఒకస్థాయి నాయకులను మాత్రమే పంపిస్తున్నారని కిందిస్థాయి నాయకులు మండిపడ్డారు. జగన్ పర్యటనకు కడప ఎయిర్‌పోర్టులో ఎంపీ అవినాశ్‌రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, కడప మేయర్ సురే్‌షబాబు, మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, అంజాద్‌బాషలు మాత్రమే స్వాగతం పలికారు. జగన్ వస్తున్నారని చెప్పి ఎయిర్‌పోర్టుకు రావాలంటూ మాజీ ఎమ్మెల్యే అంజాద్‌బాష, మేయర్ సురే్‌షబాబు క్యాడర్‌కు విజ్ఞప్తి చేసినా పెద్దగా హాజరు కాలేదు.
నూతన సభాపతి
సభాపతిగా ఏకగీవ్రంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడిని అభినందిస్తూ చంద్రబాబు శనివారం శాసనసభలో ప్రసంగించారు. అయ్యన్నపాత్రుడు చట్టసభల విలువ తెలిసిన వ్యక్తన్న చంద్రబాబు... ఆయన రాజ్యాంగ స్ఫూర్తిని నిలుపుతారని అన్నారు. సభను హుందాగా నడిపిస్తారనే నమ్మకం ఉందని తెలిపారు. కౌరవసభను.. గౌరవసభగా మార్చిన తర్వాతే ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని చెప్పి ౨౦౨౧ నవంబరు 19న సభలో నుంచి వెళ్లిపోయాను. మళ్లీ ప్రజలందరి ఆశీస్సులు, ఆమోదంతో సభలోకి ప్రవేశించానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. తన గౌరవాన్ని కాపాడిన ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగా పుట్టాలని, తెలుగుగడ్డ రుణం తీర్చుకోవాలనేది నా ఆకాంక్ష అని భావోద్వేగానికి గురయ్యారు.