ఏపీలో మరో రెండు అభివృద్ధి కార్యక్రమాలు పురుడుపోసుకున్నాయి. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో డ్రోన్, స్పేస్ సిటీలు ఏర్పాటుకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ రెండింటికి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు డ్రోన్, స్పేస్ సిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్, స్పేస్ సిటీ నిర్మాణం చేయాలనుకున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రం సాయం కోరారు. సానుకూలంగా స్పందించడమే కాకుండా డ్రోన్, స్పేస్ సిటీలకు ఏర్పాటుపై హామీ ఇచ్చింది. విశాఖ సీఐఐ సదస్సుకు హాజరైన గోయల్ శుక్రవారం డ్రోస్, స్పేస్ సిటీలకు సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.
ఏపీకి మరో భారీ పెట్టుబడి.. ప్రకటించిన లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడి రాబోతోందంటూ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేసిన ట్వీట్‌తో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ రాష్ట్రంలో ఏకంగా 12 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.1 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిందని ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ చరిత్రాత్మక పెట్టుబడితో ఏపీ ప్రగతి పథంలో మరో ముందడుగు వేయనుందని ఆయన స్పష్టం చేశారు. ఈ పెట్టుబడి ద్వారా ప్రధానంగా పునరుత్పాదక ఇంధనం, బ్యాటరీ, పంప్డ్ స్టోరేజ్, సోలార్ తయారీ, ఇతర డీకార్బనైజేషన్ కార్యక్రమాలపై దృష్టి సారించనున్నట్టు లోకేశ్ తన ప్రకటనలో తెలిపారు. వీటితో పాటు డేటా సెంటర్లు, వాణిజ్య రియల్ ఎస్టేట్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీ), మౌలిక సదుపాయాలు, పోర్టుల వంటి విభిన్న రంగాల్లోనూ బ్రూక్‌ఫీల్డ్ పాలుపంచుకోనుంది.