AP: చిన్న ఆలయాల పురోహితులకు శుభవార్త

మరో ఎన్నికల హామీ అమలు చేసిన కూటమి ప్రభుత్వం... ధూప, దీప, నైవేద్యాలు నిర్వహించే సాయం రూ.10 వేలకు పంపు;

Update: 2024-10-04 04:00 GMT

చిన్న ఆలయాల పురోహితులకి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మరో ఎన్నికల హామీ అమలుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రస్తుతం చిన్న ఆలయాలకు నెలకి రూ.5000 ఇస్తుంది. కాగా చిన్న ఆలయాలకి సాయం చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా అందించే సాయాన్ని రూ.10000లకి పెంచుతున్నట్టు తెలిపింది. ఆదాయం లేని చిన్న ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలు నిర్వహించేందుకు అందించే సాయాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఇందులో రూ.7000 పురోహితులకి జీతం కాగా రూ.3000 పూజ సామాగ్రి ఖర్చులకు వినియోగానికి అని తెలిపింది. దీనివల్ల 5,400 ఆలయాలకు ప్రతినెలా రూ.10 వేల చొప్పున అందనుంది. ఆదాయం లేని చిన్న ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు నిత్యం దీపం వెలిగించి, నైవేద్యం పెట్టేందుకు ధూప, దీప, నైవేద్యం పథకం (డీడీఎన్‌ఎస్‌) అమలు చేస్తున్నారు.

ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఖాయమైంది. ఈ నెల 7న హస్తినకు వెళుతున్నారు.. సీఎం పర్యటన ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు ఈ నెల ఏడో తేదీన ఢిల్లీ వెళ్లి.. మళ్లీ 8వ తేదీ సాయంత్రం బయల్దేరి అమరావతి చేరుకుంటారు. ఆయన ఢిల్లీ పర్యటనలో భాగంగా విశాఖ ఉక్కుపై కేంద్ర ఆర్థిక, ఉక్కు శాఖల మంత్రుల ఆధ్వర్యంలో జరిగే కీలక సమావేశంలో పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాలతో చంద్రబాబు భేటీ అవుతారని తెలుస్తోంది.. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

చంద్రబాబు కీలక సమీక్ష

మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాథమిక, పారిశ్రామిక, సేవల రంగాల్లో వృద్ధిపై సమీక్షించారు. ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడమే కాదని.. ఆయా రంగాలను బలోపేతం చేసి ప్రజల ఆదాయాలను పెంచడమే ముఖ్యమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ కొన్ని శాఖలు బాగా వెనకబడి ఉన్నాయని.. మరింత చురుగ్గా పనిచేయాలని సూచించారు. గత ప్రభుత్వ విధ్వంసకర విధానాలతో అన్ని రంగాలూ తిరోగమనంలోకి వెళ్లాయని ఆరోపించారు. గత ఐదేళ్లు ఆర్థిక వ్యవస్థ కుదేలైందని.. ప్రస్తుతం ప్రతి శాఖలో కొత్త విధానాలు తెస్తున్నామని, వాటి సమర్థ అమలుతో ఆర్థికపురోగతి సాధించాలి అన్నారు. 15% వృద్ధిరేటు సాధించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేయాలని అధికారులకు సూచించారు.

Tags:    

Similar News