AP Govt: అధికారికంగా ఎలాంటి వేడుకలు నిర్వహించొద్దు : ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు
నేడు సాధారణంగా విధులకు హాజరు కావాలని అధికారులకు సూచన;
న్యూ ఇయర్ సందర్భంగా ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ అధికారికంగా ఎలాంటి నూతన సంవత్సరం వేడుకలను నిర్వహించొద్దని, కేక్ కటింగ్ లాంటి వేడుకలకు దూరంగా ఉండాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సాధారణ పరిపాలన శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
గత నెలలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా సంతాప దినాలు కొనసాగుతున్న దృష్ట్యా.. అధికారికంగా ఎలాంటి నూతన సంవత్సర వేడుకలు చేపట్టవద్దని ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఎప్పటిలాగే అధికారులు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను కలవొచ్చని, కానీ, కేక్ కటింగ్ లాంటి వేడుకలకు దూరంగా ఉండాలని సూచించింది. ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో ఎలాంటి సందేహం ఉన్నా.. కేంద్ర ప్రభుత్వ సర్క్యులర్, లేదా బ్లూ బుక్ చూసి నివృత్తి చేసుకోవాలని సూచించింది. సంతాప దినాలు పూర్తయ్యే వరకు అధికారికంగా ఎలాంటి వేడుకలు, మీట్ అండ్ గ్రీట్ నిర్వహిచొద్దని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది.
ఇదిలాఉంటే.. 2025 కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ ఉదయం 11గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయాలనికి వెళ్లనున్నారు. సాయంత్రం వరకు పార్టీ కార్యాలయంలో చంద్రబాబు ఉండనున్నారు. అయితే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాప దినాలు దృష్ట్యా న్యూఇయర్ శుభాకాంక్షల కోసం బొకేలు, శాలువాలు తేవొద్దని, కేక్ కటింగ్ వంటి కార్యక్రమాలు కూడా వద్దని నేతలకు చంద్రబాబు సూచించారు. అయితే, మధ్యాహ్నం 12.15గంటల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ దుర్గగుడికి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.