AP: నేడు భారీ వర్షాలు.. బయటకు రావొద్దని హెచ్చరిక
తుపాను ప్రభావిత జిల్లాల్లో "రేషన్"
తీరం వైపు దూసుకొస్తున్న మొంథా తుఫాన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలను టెన్షన్ పెడుతోంది.. మొంథా తుఫాన్ ప్రభావంతో రేపు విజయవాడలో 162 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమయ్యారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) అధికారులు.. రేపు అత్యవసరమైతే తప్పా ప్రజలకు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తున్న అధికారులు.. తీవ్రత ఎక్కువ ఉంటే దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూసివేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు.. మెడికల్ షాపులు, కూరగాయలు, పాలు విక్రయ దుకాణాలు తెరుచుకోవచ్చని సూచిస్తున్నారు.. రోడ్లపై రాకపోకలు తగ్గించుకోవాలని వార్నింగ్ ఇచ్చారు వీఎంసీ అధికారులు.. చివరకు వాకింగ్ కి వెళ్లొద్దని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్, వీఎంసీ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు.
నేడు కృష్ణా జిల్లాలో అతి భారీ వర్షాలు
‘విద్యా సంస్థలకు ఇప్పటికే సెలవులు ప్రకటించాం. సోమవారం నుంచి ఉత్తర, దక్షిణ కోస్తాజిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లాలో మంగళవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉంది’ అని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సమావేశంలో మంత్రులు లోకేశ్, అనిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, అధికారులు పాల్గొన్నారు. పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
తుపాను ప్రభావిత జిల్లాల్లో "రేషన్"
తుపాను ప్రభావం ఉన్న 12 జిల్లాల్లో రేషన్ డిపోల ద్వారా నేటి నుంచే రేషన్ సరకులను పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ వెల్లడించారు. వర్షం వల్ల బాధితులకు అండగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని నాదెండ్ల వెల్లడించారు. గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, రోగుల వివరాలు తెలుసుకొని.. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని దిశానిర్దేశం చేశారు. 24 గంటలూ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.
తప్పుడు ప్రచారం వద్దు: హోంమంత్రి
మొంథా’ తుపాను నేపథ్యంలో సోషల్ మీడియాల్లో వచ్చే తప్పుడు సమాచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు. తుపానుపై సామాజిక మాధ్యమాల్లో సంయమనం పాటించాలని.. థంబ్నెయిల్స్తో ప్రజలను తప్పుదారి పట్టించవద్దని పేర్కొన్నారు. సంచలన హెడ్డింగ్లతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దన్నారు. తుపాను సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉందని పేర్కొన్నారు. అన్ని జిల్లాలోని కలెక్టరేట్లలోనూ, కంట్రోల్రూంలు ఏర్పాటు చేశారని తెలిపారు.
ఒక్కో కుటుంబానికి రూ.3వేల సాయం
మొంథా తుపానుపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ఒక్కో కుటుంబానికి రూ.3 వేల చొప్పున ఇచ్చి, 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేయాలన్నారు. పునరావాస కేంద్రాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అలాగే జిల్లాల్లో అత్యవసర వైద్య సేవలు అందించే సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. తుపానుల్ని ఎదుర్కొనేందుకు కూడా ముందుగానే ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.