AP HIGH COURT: చంద్రబాబు కేసులో కౌంటర్ వేయండి
సీఐడీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశం... విచారణ ఈ నెల 19కు వాయిదా;
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ సీఐడీ నమోదు చేసిన F.I.R..దీని ఆధారంగా విజయవాడ అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం జారీచేసిన జ్యుడిషియల్ రిమాండు ఉత్తర్వులను కొట్టేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంలో కౌంటరు దాఖలు చేయాలని సీఐడీని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అలాగే, చంద్రబాబును పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటరు వేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులను ఈనెల 18 వరకు ఒత్తిడి చేయొద్దని విజయవాడ ఏసీబీ కోర్టును ఆదేశించింది. మంగళగిరి సీఐడీ S.H, ఫిర్యాదుదారు కె. అజయ్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. కేసు విచారణ సందర్భంగా జస్టిస్ శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ తాను పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉన్నప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓ కేసులో విచారణకు హాజరయ్యానని గుర్తుచేశారు. మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతేనే విచారణ చేస్తానని తెలపగా చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్థార్థ లూద్రా ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి విచారణ చేపట్టారు.
ఈ కేసులో చంద్రబాబు తరపున వాదనలు వినించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది లూద్రా అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A నిబంధనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దర్యాప్తు సంస్థ పాటించలేదన్నారు. ఆ సెక్షన్ ప్రకారం ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ పై F.I.R నమోదు చేయాలన్నా, దర్యాప్తు కొనసాగించాలన్నా కాంపిటెంట్ అథారిటీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. దర్యాప్తు సంస్థ గవర్నర్ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబును ఆకస్మాత్తుగా నిందితుడిగా చేర్చి, అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారన్నారు. ఏసీబీ కోర్టు జ్యుడిషియల్ రిమాండు విధించిందన్నారు. గవర్నర్ నుంచి ముందస్తు ఆమోదం లేకుండా సీఐడీ నిర్వహించిన దర్యాప్తుపై కేసు నమోదు, అరెస్టు చెల్లుబాటు కావన్నారు. అంతేకాక ఏసీబీ కోర్టు విధించిన జ్యుడిషియల్ రిమాండ్‌కు చట్టబద్ధత ఉండదన్నారు. గవర్నర్ నుంచి ఆమోదం లేకుండా సీఐడీ నిర్వహించిన, నిర్వహిస్తున్న ప్రక్రియ అంతా చట్టవిరుద్ధమని వాదనలు వినిపించారు. సెక్షన్ 17A నిబంధనలను సీఐడీ పాటించలేదని.. రిమాండ్‌ను తిరస్కరించాలని చేసిన అభ్యర్ధనను అనిశా కోర్టు పట్టించుకోలేదని తెలిపారు. కాబట్టి రిమాండ్ ఉత్తర్వుల అమలును నిలువరించాలని న్యాయమూర్తిని కోరారు.
దీనిపై స్పందించిన న్యాయమూర్తి సీఐడీ వాదన వినకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్నారు. దీనిపై మళ్లీ వాదనలు వినిపించిన లూద్రా పిటిషనర్‌ను పోలీసు కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ విచారణ ఏసీబీ కోర్టు వద్ద పెండింగ్‌లో ఉందని దీనిపై కౌంటరు వేయాలని ఏసీబీ కోర్టు పట్టుపడుతోందన్నారు. పోలీసు కస్టడీ పిటిషన్ విచారణను నిలువరించాలని కోరారు. సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్‌పై కౌంటరు కోసం తాము ఒత్తిడి చేయబోమని హైకోర్టుకు తెలిపారు. హైకోర్టు ముందున్న ప్రస్తుత వ్యాజ్యంలో తాము కౌంటరు దాఖలు చేయడానికి సమయం కావాలని కోరారు. రిమాండ్ విధించిన మొదటి 14 రోజులలోపు మాత్రమే పోలీసు కస్టడీకి ఇవ్వడానికి వీలుందన్నారు. దీనిపై స్పందించిన లూధ్రా హైకోర్టు తదుపరి విచారణ చేపట్టే నాటికి మొదటిసారి విధించిన రిమాండ్ కాలం మిగిలే ఉంటుందన్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తిపోలీసు కస్టడీ పిటిషన్‌పై కౌంటరు వేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులను ఈ నెల 18 వరకు ఒత్తిడి చేయొద్దని ఏసీబీ కోర్టును ఆదేశించారు. ఈ వ్యాజ్యంపై విచారణ ఈనెల 19కి వాయిదా వేశారు.