ఇంత మంది సలహాదారులా..? ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు స్ట్రాంగ్ కౌంటర్
AP High Court: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరోమారు మెట్టికాయ వేసింది. సీఎం సహా...ప్రభుత్వానికి సలహాదారుల పేరుతో 40 మందిని నియమించుకోవటం ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు.;
AP High court
AP High Court: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరోమారు మెట్టికాయ వేసింది. సీఎం సహా...ప్రభుత్వానికి సలహాదారుల పేరుతో 40 మందిని నియమించుకోవటం ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. సలహాదారులకు ప్రభుత్వ ఖజానా నుంచి లక్షల్లో పారితోషికం, వసతులు, ప్రత్యేక సౌకర్యాల కల్పనపై స్పందించిన హైకోర్టు..రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసుకోవాలి కదా..? అని వ్యాఖ్యానించింది. సలహాదారులకు కల్పించినన్ని ప్రత్యేక సౌకర్యాలు హైకోర్టు న్యాయమూర్తులకూ లేవని పేర్కొంది ధర్మాసనం.
ప్రస్తుతం ఉన్న కొందరు సలహాదారులు మీడియా ముందుకొచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారని పేర్కొంది హైకోర్టు. దివంగత సీఎం వైఎస్ హయాంలో సలహాదారుగా పనిచేసిన కేవీపీ ... వైఎస్ మరణించాక ప్రజలకు ధైర్యం చెప్పడానికే మీడియా ముందుకు వచ్చారన్న విషయాన్నిగుర్తుచేసింది హైకోర్టు. ఎస్‌ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాలుచేస్తూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా...హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఎస్‌ఈసీ నీలం సాహ్ని నియామకం జరిగిందన్న పిటిషనర్ తరఫు న్యాయవాది...ఆ నియామకంతో వ్యక్తిగత నష్టం లేకపోయినా రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు వ్యాజ్యం దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు. నీలం సాహ్ని సీఎస్‌గా, సీఎం ప్రధాన సలహాదారుగా సేవలందించిన విషయాన్ని గుర్తుచేశారు. ఎస్‌ఈసీ నియామకం కోసం గవర్నర్‌కు సీఎం పంపిన పేర్లలో నీలం సాహ్ని పేరు ఉందని...ఎస్‌ఈసీ నియామకం గవర్నర్ విచక్షణాధికారం మేరకు జరగాలన్నారు. సీఎం లేఖతో ఆమె ప్రత్యేక అర్హత పొందారని తెలిపారు. అంటే స్వతంత్రంగా ఉండే వ్యక్తిని ఎస్‌ఈసీగా నియమించినట్లు కాదని..ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని నియామక ఉత్తర్వులను రద్దుచేయమని' పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు.
ఈ సందర్భంగా కోర్టులో నీలం సాహ్ని....సీఎం సలహాదారుగా పనిచేయడంపైనా విచారణలో చర్చకు వచ్చింది. సలహాదారుల విధులు, అర్హతకు ఏమైనా నిబంధనలు ఉన్నాయా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. నిబంధనలేవీ లేవని బదులిచ్చిన ఏజీ...వివిధ రంగాల నిపుణులను నిర్దిష్ట కాలానికి సలహాదారులుగా నియమిస్తారని తెలిపారు. అర్హతల గురించి చట్టం లేదన్న ఏజీ... ఖజనా నుంచి వారికి పారితోషకం చెల్లిస్తారని వివరించారు. సలహాదారుల విధులను వారి నియామక జీవోలో పేర్కొన్నారన్నట్లు ఏజీ హైకోర్టులు తెలిపారు.